అమరావతి : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్ష సూచనను జారీ చేసింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఒడిశా ప్రాంతంపై ఏర్పడిన ఆవర్తనం బలహీన పడింది. అయినప్పటికీ, బంగాళాఖాతం నుండి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కాలంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు సంభవించే సమయంలో, ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమవుతున్నందున, తుఫానుల సమయంలో చెట్ల నీడలో ఆశ్రయం పొందవద్దని, అధికారిక వాతావరణ సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నైరుతి రుతు పవనాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వారం మొత్తం తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. దీనివల్ల ఎంతో అవసరమైన వర్షాలు కురిసినప్పటికీ, స్థానికంగా అంతరాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది.
