సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన మానవ వనరులతో పాటు భూ సంపద ఉందన్నారు. సింగపూర్ ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఏపీ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీపై చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి సీఎం వివరించారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందని తెలియ చేశారు.
పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యతతో పాటు సేవల రంగంలో నిపుణులైన మానవ వనరులు ఏపీలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ కీలకంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు, సరకు రవాణాకు పోర్టులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌తో పాటు ఇంటర్నెట్ సహా డేటా సేవల కోసం సబ్ సీ కేబుల్‌ను ఏపీ నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నారని తెలిపారు సీఎం. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రపంచ దిగ్గజ స్టీల్ తయారీ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సింగపూర్‌లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే తదితరులు పాల్గొన్నారు.
