అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఒకే కులానికి పరిమితం చేయొద్దని కోరారు. తనకు ఏ కుల గుర్తింపూ వద్దన్నారు. కేవలం భారతీయుడిగా మాత్రమే గుర్తింపు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాకినాడకు చెందిన వినోద్ అనే వ్యక్తి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నగర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ , నిధుల లభ్యతను అంచనా వేయకుండానే అనేక పనులకు అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి కూడా కార్పొరేషన్ వద్ద నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు పవన్ కల్యాణ్. నేరస్తులు , వారి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పోలీసులను ఆదేశించారు. నేరపూరిత చర్యలను కులాలు లేదా కుల నాయకులకు ఆపాదించ కూడదని ఆయన నొక్కి చెప్పారు.
కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో ప్రజలు తమ సమస్యలను వివరించగా, సంబంధిత అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. నేరస్తులపై ఎటువంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే తనకు ఏ కుల గుర్తింపూ ఆపాదించ కూడదని పవన్ కళ్యాణ్ కోరారు. తాను భారతీయుడిగా జీవించాలని, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించేలా ప్రస్తుత వ్యవస్థను మార్చాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కాపు సంఘం సలహాదారు డి.ఎన్. రమేష్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌కు తన కులం పట్ల సంకోచం ఉంటే, ఇకపై ఆయన కాపుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని అన్నారు. భవిష్యత్తులో కాపుల నుండి ఓట్లు కూడా ఆశించకూడదని రమేష్ వ్యాఖ్యానించారు.