అమరావతి : రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించే ఈ పథకం వ్యవసాయ రంగానికి బలమైన అండగా నిలుస్తోందని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత పరిణామాలతో పాటు గత పరిస్థితులను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించారని, ఆ సమయంలో కొత్త రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, కార్యాలయాలు లేకపోవడం, ఉద్యోగులు పనిచేసే పరిస్థితులు లేకపోవడం, రూ.16 వేల కోట్ల అప్పుతో రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని గుర్తు చేశారు.
అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ప్రజలు విశ్వసించి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచేదని అభిప్రాయపడ్డారు. అయితే 2019 ఎన్నికల్లో తప్పుడు హామీలు, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలను దెబ్బ తీసిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను నిర్వీర్యం చేసిందని వాపోయారు.
2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, తెదేపా జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయగా, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టగల నాయకుడు చంద్రబాబేనని ప్రజలు విశ్వసించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించామని, అన్ని శాఖల ఖజానాలు ఖాళీ అయ్యాయని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికల హామీలు, సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాలనా రికార్డును అధిగమించిందని తెలిపారు.
