శ్రీవారి భక్తులకు శఠగోపం దర్యాప్తు ముమ్మరం
నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు.
తిరుమల: సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తానని నమ్మబలికి గుంటూరు జిల్లాకు చెందిన సుమారు 60 మంది భక్తుల నుంచి రూ.4.22 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాస రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.) ఉద్యోగులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కోటా ద్వారా సుప్రభాత సేవ దర్శన టికెట్లు మరియు తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తానని నమ్మబలికాడు.ఈ క్రమంలో 60 మంది భక్తుల దర్శన టికెట్ల కోసం రూ.3,60,000/- మరియు 12 వసతి గదుల కోసం రూ.62,000/- కలిపి మొత్తం రూ.4,22,000/-ను వివిధ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితుడు జూన్ 22న దర్శనం ఏర్పాటు చేస్తానని చెప్పడంతో బాధితులు తిరుపతి, తిరుమలకు చేరుకున్నారు. అనంతరం నిందితుడు కొంతసేపు ఫోన్ ద్వారా మాట్లాడి, తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. తను అందజేసిన సిఫారసు లేఖలను టి.టి.డి. అధికారులకు చూపగా అవి నకిలీవని నిర్ధారణ కావడంతో, టి.టి.డి. విజిలెన్స్ అధికారుల సూచన మేరకు బాధితులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు, వసతి గదుల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. టి.టి.డి. సేవలకు సంబంధించిన అన్ని బుకింగ్‌లు అధికారిక మార్గాల ద్వారానే చేసుకోవాలి. వ్యక్తిగత పరిచయాలు, మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లించవద్దు అని సూచించారు.
అలాగే, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత సేవల ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో పాటు అత్యవసర సేవల నంబర్ 112 లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం అందించాలి అని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
