తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో, శ్రీ వకుళామాత కరుణా కటాక్షాల మధ్య వేదోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయ బద్ధంగా జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొన దలచిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పాల్గొనే ప్రతి చిన్నారికి ఉచితంగా “అక్షర గోవిందం” కిట్ అంద జేయనున్నట్లు తెలిపారు. జూలై 4 నుండి ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌కు 25 మంది చొప్పున అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు శ్రీ వకుళామాత ఆలయ సమీపంలోని యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వకుళామాతకు చతుర్‌కలశ స్నపనం, పంచగవ్య, క్షీర, జలాభిషేకాలు, వివిధ హోమాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ఇన్‌చార్జి కార్యదర్శి డా. మేడసాని మోహన్, డిప్యూటీ ఈవోలు వరలక్ష్మి, శివప్రసాద్, ఎస్.ఈ మనోహరం, వీజీవోలు గిరిధర్, వేంకటేశ్వర్లు, ఈఈ మల్లికార్జున ప్రసాద్, డీఈ సరస్వతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
