అమరావతి : ఏపీలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది వీబీజీ రామ్ జీ పథకం. ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది గురువారం నుంచి . ఈ సందర్భంగా పనులు ప్రారంభించారు కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఈ పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమం వీబీజీ రామ్ జీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. గతంలో నరేగా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతం అయ్యిందని అన్నారు. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్ జీ కింద పనులు చేపడతాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
ఈ పథకంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో గ్రామాల రూపు రేఖలు మారతాయని చెప్పారు. 125 రోజుల పనిదినాలతో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన ఏ పనైనా చేపట్టేందుకు వీబీజీ రామ్ జీ కింద అవకాశం ఉందన్నారు. రహదారులు, డ్రైనేజీలు, కాలువలు ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారం ఉండేలా ఈ పథకం వినియోగిస్తాం అన్నారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ లాంటి సాంకేతికతతో పనులు చేపడతామని చెప్పారు సీఎం. గాలేరు నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకువస్తాం, జలధార ద్వారా భూగర్భ జలాలను కూడా పెంచుతాం అన్నారు. రాష్ట్రాలు కూడా వ్యయం చేసేలా ఈ కార్యక్రమం చేపట్టటం భారం కాదు బాధ్యత అని అన్నారు. 13,226 గ్రామాల్లో ఒకే మారు గ్రామసభలు పెట్టి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కే దక్కిందన్నారు.
