న్యూఢిల్లీ : తమ లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రకటనలు, ప్రచార సామగ్రిపై తప్పుదోవ పట్టించే 100 శాతం వాదనలు ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకం, పంపిణీ , మార్కెటింగ్‌ను తక్షణమే నిలిపి వేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) డాబర్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. తగిన శాస్త్రీయ ఆధారాలు లేకుండా, సంపూర్ణ స్వచ్ఛత, ప్రామాణికత లేదా శ్రేష్ఠత అనే అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా ఇటువంటి వాదనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఆహార భద్రతా నియంత్రణ సంస్థ గమనించింది. ఆహార వ్యాపార నిర్వాహకులందరూ తమ ఉత్పత్తి లేబుల్స్ మరియు ప్రకటనలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్, 2018లోని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని సంస్థ పేర్కొంది.
ప్రభావితమైన అన్ని ఆహార ఉత్పత్తుల నుండి నిబంధనలకు అనుగుణంగా లేని వాదనలను ఉపసంహరించు కోవడం లేదా సవరించడం ద్వారా తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆహార నియంత్రణ సంస్థ డాబర్ ఇండియాను ఆదేశించింది. ఈ ఆదేశానికి అనుగుణంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ, 15 రోజుల్లోగా నియంత్రణ సంస్థకు ఒక కార్యాచరణ నివేదిక ను సమర్పించాలని కూడా ఆ కంపెనీని ఆదేశించారు. ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే వాదనలు వినియోగదారుల రక్షణ సూత్రాలను ఉల్లంఘిస్తాయని పునరుద్ఘాటించింది. అలాగే ఆహార తయారీదారులు చేసే అన్ని వాదనలు సత్యమైనవని, శాస్త్రీయంగా నిరూపించబడినవని, మోసపూరితమైనవి కావని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని నొక్కి చెప్పింది. ఈ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే, ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని వర్తించే నిబంధనల ప్రకారం నియంత్రణ చర్యలు ఎదుర్కోవలసి రావచ్చని హెచ్చరించింది.
