అమరావతి : ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక అప్ డేట్ ఇచ్చారు ఇవాళ. గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ISA ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని వెల్లడించారు. డేటా సెంటర్లు వస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మాకెందుకు స్టీల్ ప్లాంట్.. మాకెందుకు ఏఐ.. మాకెందుకు డేటా సెంటర్లు అంటూ పేదరికంలోనే బాధపడాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఆదాయం, రాష్ట్రానికి సంపద తీసుకొచ్చే పరిశ్రమలు, సాంకేతిక రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజల జీవితాలను మార్చేలా పబ్లిక్ పాలసీలు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం ఎంత ముఖ్యమో.. అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. మంచి రోడ్లు వేయాలన్నా.. మౌలిక వసతులు కల్పించాలన్నా.. సంపద సృష్టించాల్సిందేనని తెలిపారు. సంపద సృష్టికి కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటు.. పెట్టుబడులను ఆకర్షించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. పరిశ్రమలు వస్తే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో కియా కార్ల పరిశ్రమను ఉదాహరణగా సీఎం ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్లే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.