నిషేధిత జాబితాలో కొత్తగా ఒక్క సెంట్ భూమిని చేర్చలేదు

జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ ఒక్క పేద వ్యక్తికి గానీ, నిజమైన భూ యజమానికి గానీ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం, అదే సమయంలో అర్హులైన వారి హక్కులను కాపాడటం అనే రెండు లక్ష్యాల దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 22A నిషేధిత జాబితాలో ఉద్దేశ పూర్వకంగా ఒక్క సెంట్ భూమిని కూడా చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని, వివాద రహిత ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన నొక్కి చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని 22A నిషేధిత భూములు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు , ప్రభుత్వ విధానాలపై వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి , సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సమావేశం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి సంబంధించినదే అయినప్పటికీ ఇక్కడ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు మరియు స్టాంప్స్ , రిజిస్ట్రేషన్ అధికారులు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాల‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!