వంతెనల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలకు చెక్
వెల్లడించిన మంత్రులు పొన్నం, అజారుద్దీన్ , వీహెచ్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెనల నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం జరుగుతుందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మహమ్మద్ అజారుద్దీన్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, మూసారాంబాగ్ బ్రిడ్జిలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావుతో కలిసి. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ రూ. 680 కోట్ల వ్యయంతో పూర్తయిందని చెప్పారు. ఈ వంతెన చంచల్‌గూడ జైలు నుండి ఒవైసీ ఆసుపత్రి వరకు విస్తరించి ఉందని, అలాగే చంపాపేట్‌కు అనుసంధానించే అదనపు మార్గం కూడా ఇందులో ఉందని అన్నారు.
ఈ వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. వీటి నిర్మాణం వల్ల సంతోష్ నగర్, చంచల్‌గూడ జైలు ప్రాంతం, సైదాబాద్ , చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దీని వల్ల నగరంలోని ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో, ఎటువంటి అసౌకర్యం లేకుండా చేరుకోవచ్చని పేర్కొన్నారు.సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్‌తో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు . ఈ రెండు వంతెనలు ఆయా ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ వంతెనలకు వెళ్లే అనుసంధాన రహదారులను (అప్రోచ్ రోడ్లు) వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు; అలాగే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వంతెన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు.
నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు, అలాగే కేబీఆర్ (KBR) పార్క్ సమీపంలో వంతెన పనులు కూడా వేగంగా సాగుతున్నాయని తెలిపారు.ఈ వంతెనలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, ప్రయాణంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఫ్లైఓవర్లను నిర్మిస్తోందని అన్నారు. ఈ ఫ్లైఓవర్లు ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడమే కాకుండా, ప్రయాణికుల సమయాన్ని కూడా ఆదా చేస్తాయని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాలు మరియు రద్దీగా ఉండే జంక్షన్లను ప్రభుత్వం గుర్తిస్తోందని, ప్రజల సౌకర్యార్థం అనువైన ప్రదేశాలలో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పరిశీలిస్తోందని అన్నారు.
