హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం కలకలం రేపింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి తెలంగాణ ఇంటర్ బోర్డుకు సమర్పించాయి పలు కాలేజీలు. దీని వ్యవహారంపై హైడ్రా సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాజాగా ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. నకిలీ ఫైర్ ఎన్ వోసీలపై హైడ్రా లోతైన విచారణ చేపట్టింది. ఫేక్ ఫైర్ ఎన్ వోసీల సృష్టికర్తలు ఎవరనే దానిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని హైడ్రా తెలిపింది. గడ్డం శ్రీనివాస యాదవ్ అనే రాజకీయ నాయకుడి కళాశాల (హైందవీ జూనియర్ కళాశాల)కు చెందిన ఫేక్ ఎన్ వో సీ పై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా కళాశాలలు ఫేక్ ఫైర్ ఎన్ వోసీలతో ఇంటర్ బోర్డు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది.
దీంతో ఓ ఆర్ ఆర్ పరిధిలోని కళాశాలల ఫైర్ ఎన్‌వోసీలన్నిటినీ పరిశీలించడం ప్రారంభించింది. ప్రాథమికంగా కొన్నిటిని పరిశీలించగా 8 కళాశాలల ఫైర్ ఎన్‌వోసీలు నకిలీవని తేలింది. వెనువెంటనే జులై 4వ తేదీన నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మరో 44 కళాశాలల ఫైర్ ఎన్ వోసీలు ఫేక్‌వని తేలింది. ఈ జాబితాను కూడా లేక్ పోలీసులకు అందజేసింది. ఇలా కళాశాలలన్నీ సమర్పించిన ఫైర్ ఎన్ వోసీలను ఇంటర్ బోర్డుతో కలిసి హైడ్రా పరిశీలిస్తోంది. నకిలీ ఫైర్ ఎన్‌వోసీలకు సంబంధించి హైడ్రా దృష్టికి రాగానే విచారణ చేపట్టడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం.,ఇంటర్ బోర్డుకు లేఖ రాయడం ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తూ వచ్చింది. ఇందులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ లో ఒక అధికారి ని నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఆ అధికారి హైడ్రా తో కలసి నకిలీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
