అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని రిలీజ్ చేసింది. ఈ మేరకు స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ. 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేట్ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి, కీలకమైన కార్పస్ నిధుల అవసరాన్ని ఇది భర్తీ చేస్తుంది. ప్రాజెక్టుల ప్రణాళిక, పరిశీలన, సేకరణ, అమలు , పర్యవేక్షణతో కూడిన సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రారంభ దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిలిచే ప్రాజెక్టులకు ‘ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్’ (ప్రాజెక్ట్ సాధ్యతను కాపాడే తాత్కాలిక నిధి) అందించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం , పరిపాలనా సామర్థ్యాన్ని వినియోగించు కోవడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని స్పష్టం చేసింది.
ప్రజలకు సమర్థవంతమైన సేవలతో పాటు, అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడిన అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాలకు అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పీపీపీ పాలసీని తీసుకు వచ్చిందని ఈ సందర్బంగా వెల్లడించింది. రవాణా, లాజిస్టిక్స్, ఓడరేవులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం , పర్యాటక రంగాలలో పీపీపీ ప్రాజెక్టులను కార్యరూపం దాల్చేలా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని పేర్కొంది. సుమారు రూ. 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన ఇలాంటి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ పీపీపీ విధానాన్ని రూపొందించారు.
