హైదరాబాద్ : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ దర్శకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు లోకేష్ కనగరాజ్. తాజాగా తను హీరోగా మారి నటించిన చిత్రం డీసీ. ఇది ఇటీవలే రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దీంతో తొలి రోజే డీసీ మూవీ రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు , నటుడు లోకేష్ కనగరాజ్ నటించిన తొలి చిత్రం కావడం విశేషం., తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దానికంటే మంచి వసూళ్లను సాధించడం ఆనందంగా ఉందని పేర్కొంది చిత్ర బృందం. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో కలిపి సుమారు రూ. 4.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇందులో మొదటి రోజు రూ. 1.30 కోట్లు, రెండో రోజు రూ. 2.30 కోట్ల వసూళ్లు ఉన్నాయి; డబ్బింగ్ చిత్రానికి ఇది మంచి గణాంకమని చెప్పవచ్చు.
ఈ సినిమాకు ఇంకా మెరుగైన ప్రచారం లభించి ఉంటే, వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవి అని ఒక పంపిణీదారుడు పేర్కొన్నారు. లోకేష్ కనగరాజ్ , వామికా గబ్బి తీవ్రమైన పాత్రల్లో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. కథాంశం కంటే ప్రధాన నటీనటుల అభినయం, అనిరుధ్ రవిచందర్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాకు బాగా కలిసొచ్చేలా చేశాయి. దీనివల్ల స్క్రిప్ట్‌లోని కొన్ని లోపాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించు కోలేదని తెలుస్తోంది. సినిమాలోని ‘డార్క్ వరల్డ్’ సంగీతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టాయి. తెలుగు ప్రేక్షకులు దీనిని బాగా ఆదరించారు అని ఆయన వివరించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఆదరించారు. రాబోయే రోజుల్లో డీసీ మరిన్ని వసూలు చేసే ఛాన్స్ ఉంది.
