హనుమకొండ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. సొంతింటిని అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని అన్నారు. పేదల కష్టాలు, బాధలు తీర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను చేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని పేర్కొన్నారు.
సొంతిల్లు అనేది ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి అన్నారు. గతంలో వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలి పోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఇల్లు ఎవరు నిర్మించారన్నది కాకుండా, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లను, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లను, ఇప్పటివరకు హైద్రాబాద్ తో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను మంజూరు చేసేనట్లు మంత్రి తెలిపారు. అనంతరం మూడో, నాలుగో దశల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించే వరకు ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని స్పష్టం చేశారు.