సంస్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ‌లో పౌరుల భాగ‌స్వామ్యం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన కేంద్ర కేబినెట్ ముఖ్య కార్య‌ద‌ర్శి

హైద‌రాబాద్ : భారత ప్రభుత్వం ప్రతిపాదించిన రీఫార్మ్ ఉత్సవ్ కార్యక్రమంపై చర్చించేందుకు భారత ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంస్కరణల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో అక్టోబర్ 2026లో “రీఫార్మ్ ఉత్సవ్” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు క్యాబినెట్ కార్యదర్శి వెల్ల‌డించారు. పౌరుల అభిప్రాయాలు, సూచనలను గుర్తించడం వాటిపై చర్చించడం, ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చడం, ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వారా వాటిని అమలు చేయడం లేదా పురోగతి సాధించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమం మూడు దశల్లో అమలు చేయడం జ‌రుగుతుంద‌న్నారు. మొద‌టి ద‌శ‌లో కార్యక్రమం సమర్థవంతమైన అమలుకు అవసరమైన పాలనాపరమైన విధానాన్ని రూపొందించడం, అవగాహన కల్పించే కార్యక్రమాలు, ప్రచారాలను నిర్వహించడంపై దృష్టి సారించాల‌న్నారు. రెండో ద‌శ‌లో అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు పౌరులు, సంబంధిత వర్గాల నుండి సమస్యలు, సూచనలను గుర్తించడంపై దృష్టి సారిస్తారు. అక్టోబర్ 10 నుండి నవంబర్ 30 వరకు చర్చలు జరపడం, తక్షణ ఫలితాలనిచ్చే అలాగే మధ్యకాలిక సంస్కరణలను అమలు చేయడంపై దృష్టి సారిస్తారు. డిసెంబర్ 20 వ‌ర‌కు సంస్కరణల అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ , ప్రాంతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఇక మూడో ద‌శ‌లో నిర్మాణాత్మక సంస్కరణలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, ఈ కార్యక్రమం నిర్దేశించిన విధంగా ఆచరణాత్మక సంస్కరణ లక్ష్యాలు సమర్పణపై దృష్టి సారించాల‌ని కేంద్ర కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు. రీఫార్మ్ ఉత్సవ్” కార్యక్రమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక రాష్ట్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఈ కార్యక్రమ అమలును సమన్వయం చేయడానికి ఒక రాష్ట్ర స్తాయిలో, జిల్లా స్థాయిలో నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మించాల‌న్నారు.

సంస్కరణలకు సంబంధించిన కార్యకలాపాలలో భాగస్వామ్యం, సూచనల సేకరణ, పర్యవేక్షణ , సమన్వయాన్ని సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సంస్కరణ ఉత్సవ్’ పోర్టల్‌ను ప్రారంభిస్తుంద‌ని తెలిపారు. ఈ పోర్టల్ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు విస్తృతంగా ఇందులో పాల్గొనే అవకాశం కలుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!