హైదరాబాద్ : ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తన ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలంగా కేంద్ర సర్కార్ పై, ప్రత్యేకించి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ , భజగరంగ్ దళ్ తదితర హిందూ వాద సంస్థలను ఏకి పారేస్తూ వస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన సర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా మంగళవారం సామాజిక వేదిక ఎక్స్ లో బెంగళూరులో ఓటర్ల జాబితా నుండి తన ఓటు తొలగించారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి వీడియో పోస్టు చేశారు. తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తర్వాత ఓటు హక్కును కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో తాను ఒకడినని నటుడు పేర్కొన్నారు.
మీతో ఒక జోక్ పంచుకోవాలని అనుకుంటున్నాను. సర్ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కును కోల్పోయిన లక్షల మంది ఓటర్లలో తాను కూడా ఒకడిగా మారి పోయానని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. ఇంతకు మించిన జోక్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను. ఇక్కడే నివసించాను, నా పాఠశాల, కళాశాల విద్య, నాటక రంగ ప్రస్థానం ఇక్కడే సాగాయి. మీ సమాచారం కోసం చెబుతున్నాను, నేను ఈ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని జాతీయ అవార్డు గ్రహీత, బహుభాషా నటుడు అన్నారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుందో చూస్తానని రాజ్ అన్నారు. సరే, జోక్ బాగుంది. ఆట మొదలైంది. దీని కోసం ఎలాంటి ప్రక్రియను అనుసరించాలో చూద్దాం. నా ఓటర్ ఐడిని తిరిగి పొందడానికి ఏయే పత్రాలు చూపించాల్సి ఉంటుంది? అని ప్రశ్నించారు.
