హైదరాబాద్ : ఆహార భద్రత వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు సంగారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ రోహిత్ సింగ్‌తో సహా ఉన్నతాధికారులతో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే పంపిణీ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల కేంద్రాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు జరుగుతాయని, తద్వారా ఇది రాష్ట్రవ్యాప్త లబ్ధిదారుల కార్యక్రమంగా మారుతుందని పేర్కొన్నారు.
అంతకు ముందు తన కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో మాట్లాడారు మంత్రి. ప్రస్తుతం తెలంగాణలో 1.06 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖను , జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.
దీనిని ఒక భారీ బహిరంగ సభగా నిర్వహిస్తామని, లబ్ధిదారుల తరలింపు, కూర్చునే ఏర్పాట్లు, భద్రత, పంపిణీ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌పై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. కార్యక్రమం నిర్ణీత సమయంలోనే ముగిసేలా, తద్వారా ఆ రోజు తర్వాత జరగాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలకు ముఖ్యమంత్రికి ఎటువంటి జాప్యం కలగకుండా ఉండేలా ‘నిమిషాల వారీ’ కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోసం వివిధ వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్డులను నిర్దేశిత లామినేటెడ్ విధానంలో తయారు చేయాలన్నారు.
మిగిలిన జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాల కోసం కలెక్టర్లకు సమగ్ర మార్గదర్శకాలను తెలియ జేయాలని ఆయన పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. నిధుల విషయంలో ఎటువంటి సందిగ్ధత లేకుండా జిల్లా యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు చేసుకునేలా, సహేతుకమైన వ్యయ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తెలంగాణలో ఆహార భద్రత కార్యకలాపాల భారీ స్థాయిని ప్రస్తావిస్తూ, వరి సేకరణకు వెచ్చించే దాదాపు రూ. 20,000 కోట్లతో పాటు, రేషన్ బియ్యం కోసం రాష్ట్రం ఏటా సుమారు రూ. 14,000 కోట్లు ఖర్చు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
