కూరగాయల సాగుపై కార్యాచరణ ప్రణాళిక : జి. చిన్నారెడ్డి
ప్రతిరోజూ 1.20 లక్షల కిలోల కూరగాయాలు అవసరం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణలో కూరగాయల సాగుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కె. సురేంద్ర మోహన్, బి. గోపి, నవీన్ నికోలస్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 కేంద్రీకృత వంటశాలల పరిసరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేలా ప్లాన్ ఉండాలన్నారు. 20.50 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ సుమారు 1.20 లక్షల కిలోల కూరగాయల అవసరం అవుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 22 నాటికి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన తయారు కావాలన్నారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల సాగును ప్రోత్సహించడంపై ఫోకస్ పెట్టాలన్నారు.
పాఠశాల అల్పాహార పథకం అవసరాలను తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల సాగును ప్రోత్సహించే సమగ్ర ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. గ్రామీణ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు గాను రైతుల నుండి నేరుగా కూరగాయలను సేకరించాలన్నారు. మహిళా రైతు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, రైతులకు స్థిరమైన మార్కెట్‌ను కల్పించేలా ఉండాలన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రస్తుతం హరే కృష్ణ మిషన్, మన్నా ట్రస్ట్ , అక్షయపాత్ర వంటి సంస్థల సహకారంతో ఆహార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సంస్థలకు అవసరమైన కూరగాయలను నేరుగా రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా ఒక ప్రత్యక్ష సేకరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చని సమావేశం అభిప్రాయ పడింది. ఇటువంటి వ్యవస్థ మధ్యవర్తుల పాత్రను తగ్గించి, రైతులకు మంచి ధరలు లభించేలా చేసి, తాజా కూరగాయల సరఫరా నిరంతరాయంగా ఉండేలా చేస్తుందన్నారు.
