అనంతపురం జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై . మంత్రి నారా లోకేశ్ అంటే జగన్ రెడ్డికి భయం. అందుకే ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు రా అని మంత్రి లోకేశ్ సవాల్ చేసినా జగన్ భయపడి రావడం లేదనన్నారు. మళ్లీ మరోసారి సవాల్ చేస్తున్నా మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం అన్నారు మంత్రి ఎస్. సవిత. నారా లోకేశ్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్ కు, వైసీపీ నేతలకు లేదన్నారు. గొడ్డలి పార్టీ చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించు కుంటున్నారని అయినా బుద్ది రావడం లేదన్నారు .
అనంతపురం జిల్లా గుంతకల్లులో రూ.18 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా పది ఎంజేపీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. రాయలసీమలో 5, ఉత్తరాంధ్రలో 5 ఎంజేపీ గురుకులాలను ప్రారంభించామన్నారు. వాటిలో గుంతకల్లులో అధికంగా ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంజేపీ గురుకుల పాఠశాలను ప్రారంభించామన్నారు సవిత.
అయిదేళ్ల వైసీపీ పాలనలో బీసీల విద్యను జగన్ గాలి కొదిలేశారని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎంజేపీ గురుకులాల భవనాలు 70 నుంచి 80 శాతం పూర్తయినా జగన్ పట్టించు కోలేదన్నారు. చివరికి పులివెందులలోని ఎంజేపీ గురుకులానికి సైతం నిధులు మంజూరు చేయలేదన్నారు. తరవాత వచ్చిన కూటమి ప్రభుత్వం అర్థాంతరం నిలిచి పోయిన ఎంజేపీలకు నిధులు మంజూరు చేసి, ఆయా భవనాలను పూర్తి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గుంతకల్లులో రూ.18 కోట్లతో నిర్మించిన విశాలమైన భవనాలను నిర్మించి, బీసీ బిడ్డలకు అంకింతం చేశామని మంత్రి సవిత ప్రకటించారు.
