హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయాలని, ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ను ఆదేశించారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని స్పష్టం చేశారు. అలాగే రెండో దశ లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని గమనించిన ఆయన, అదనపు కోచ్‌లను సమకూర్చు కోవడం సహా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓల్డ్ సిటీలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి చంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల మార్గంలో భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, మెట్రో రైలు పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మెట్రో రెండో దశలో భాగంగా ఉన్న ఎంజీబీఎస్ -చంద్రాయణగుట్ట కారిడార్ విషయంలో, అత్యాధునిక సాంకేతికత వినియోగంపై సలహాలు పొందేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను సంప్రదించాలని ఆయన అధికారులను కోరారు. ఓల్డ్ సిటీ మెట్రో రైలు ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి ఆధునిక సాంకేతికత , నైపుణ్యాన్ని వినియోగించుకోవడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. సమావేశంలో డిసెంబరులో ‘ఫ్యూచర్ సిటీ’లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. సదస్సును సజావుగా , విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు. సదస్సు సందర్భంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను సత్కరించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన సూచించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది సదస్సు తర్వాత తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు మరియు సాధించిన పురోగతికి సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని ఆదేశించారు. పెట్టుబడుల విషయంలో మరింత పురోగతిని సాధించడానికి , ఆకర్షణీయమైన అంతర్జాతీయ పెట్టుబడి గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు.
