హైదరాబాద్ : నల్లగండ్ల చెరువు పునరుద్దరణ పనుల కోసం రైతులు సహకరించేందుకు ముందుకు రావడం పట్ల అభినందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో రైతులతో కలిసి నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. మొత్తం 90 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువులో సుమారు 70 ఎకరాలు రైతుల పట్టా భూములే ఉన్నాయన్నారు. ఇవన్నీ చెరువు పూర్తి నీటి మట్టం పరిధిలోకి వస్తుండటంతో చెరువు సమగ్ర అభివృద్ధికి సహకరించేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. దీనికి సంబంధించి వారు గతంలోనే అందరి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తమకు సమర్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి టీడీఆర్ కింద పరిహారం అందేలా చూడాలని రైతులు కమిషనర్‌ను కోరారు. చెరువు కట్టపై పురాతన అమ్మవారి ఆలయం ఉందని, అక్కడ పూజలు నిర్వహించు కోవడానికి మరికొంత స్థలం కేటాయించాలని కోరుతూ వారు కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఇదిలా ఉండగా నల్లగండ్ల గ్రామంలోని నల్లగండ్ల చెరువు ఎఫ్ టీ ఎల్ విస్తీర్ణం 90 ఎకరాలు. ఆక్రమణల తొలగింపుతో అదనంగా మరో 13 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్‌తో కలిపి మొత్తం 103 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేస్తోంది. చెరువు అభివృద్ధి తీరు, నీటి రాకపోకల మార్గాలు, చెరువు చుట్టూ ఏర్పాటు చేయనున్న ఆకర్షణల గురించి, పనులను పర్యవేక్షిస్తున్న ‘విమోస్ టెక్నోక్రాట్స్’ డైరెక్టర్ యూనస్ కమిషనర్ రంగనాథ్‌కు వివరించారు. చెరువుకు ఒక వైపున సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అక్కడి నుండి భారీగా వరద నీరు చెరువులోకి చేరుతుంది. ఆ నీటిని చెరువులోకి మళ్లించేలా ఇన్‌లెట్‌లను (నీటి ప్రవేశ మార్గాలను) అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ పచ్చని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదనపు నీటిని నిల్వ చేసేందుకు, పేరుకు పోయిన పూడికను తొలగించడమే కాకుండా చెరువును మరింత లోతుగా తవ్వాలని పేర్కొన్నారు. చెరువు అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన రైతులనఅభినందించారు. ఈ సందర్భంగా, చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
