రైల్వే పాస్‌ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తా

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ

గుంటూరు జిల్లా : అర్హులైన జర్నలిస్టులకు గతంలో మంజూరు చేసిన విధంగా రైల్వే పాస్‌లు పునరుద్ధరించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తగిన విధంగా కృషి చేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రైల్వే పాస్‌లు, ప్రయాణ రాయితీతో పాటు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, గుంటూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రయాణించాల్సి ఉంటుందని కృష్ణాంజనేయులు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్న విధంగానే, గతంలో రైళ్లలో కూడా జర్నలిస్టులకు 50 శాతం వరకు ప్రయాణ రాయితీతో పాటు ప్రత్యేక రైల్వే పాస్ సౌకర్యం ఉండేదని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న రైల్వే పాస్/ప్రయాణ రాయితీ సౌకర్యం నిలిచి పోవడంతో వృత్తిపరమైన విధులు నిర్వహించే జర్నలిస్టులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఏపీజేఎఫ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, గుంటూరు జిల్లాలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను కూడా మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. . జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, రైల్వే పాస్ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యల కోసం ప్రయత్నిస్తానని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your Email Id will not be published!