చెన్నై : ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు డీఎంకే నేత ఎలాంగోవన్. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశ పెట్టినప్పుడు బీజేపీ దానిని వ్యతిరేకించిందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుతో ముడిపెట్టి మహిళా రిజర్వేషన్ అమలులో జాప్యం చేయడం మహిళలను అవమానించడమేనని సీనియర్ డీఎంకే నేత ఈవీకేఎస్ ఎలాంగోవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలోని ప్రస్తుత సభ్యుల సంఖ్య (సీట్ల) పరిధిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కోటాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులోని టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం తన మొదటి 100 రోజుల పాలనలో వ్యవహరించిన తీరును ఎలాంగోవన్ తప్పుబట్టారు. 33 శాతం రిజర్వేషన్‌ను పార్లమెంటరీ సీట్ల పెంపుతో ముడిపెట్టే కేంద్రం వాదనను ఆయన విమర్శించారు.
వారు ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి”అని అన్న ఎలాంగోవన్, సీట్ల సంఖ్య పెంపులో జాప్యాన్ని మహిళలకు అవమానం”గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పిస్తూ పరిపాలనాపరమైన పనితీరు ఏమాత్రం బాగోలేదని ఎద్దేవా చేశారు. టీవీకే ప్రభుత్వం కేవలం ఉన్న పథకాల పేర్లను మార్చడానికే పరిమితమైందని ఎలాంగోవన్ ఆరోపించారు. డీఎంకేపై అన్ని విధాలుగా దాడి చేయడమే వారి ఏకైక సిద్ధాంతం అని పేర్కొన్నారు. తన ప్రభుత్వంపై జరిగిన కుట్రను అడ్డుకున్నానని సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేదని, డీఎంకే కూటమిలో గెలిచిన పార్టీలపైనే అది ఎక్కువగా ఆధారపడి ఉందని ఎలాంగోవన్ గుర్తు చేశారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే, మద్దతు ఇస్తున్న ఈ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
స్టాలిన్‌కు సమాధానం చెప్పలేరు కాబట్టే, ఆయన సభలో లేనందుకు విజయ్ సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయ్‌కు తక్షణమే స్పందిస్తూ రాజకీయ చర్చలు జరిపే సామర్థ్యం లేదని, ఆయన సరైన సన్నద్ధత లేకుండా, కేవలం తనకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన అంశాలను చదివి వినిపిస్తారని ఎలాంగోవన్ వ్యాఖ్యానించారు.
