మండల స్థాయి ప్ర‌జా వాణి విజ‌య‌వంతం

మొత్తం 5,410 వినతుల స్వీకరణ

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి సొంత మండల స్థాయిలోనే నేరుగా స్వీకరించి, పరిష్కార మార్గాలను చూపడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించడంతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రజావాణి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ., రాష్ట్ర నోడల్ అధికారి కె. విద్యాసాగర్ తెలిపారు. మండల స్థాయి ప్రజావాణి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి మొత్తం 5,410 వినతులు (అర్జీలు) స్వీకరించ బడ్డాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు.

అధికారులు ప్రజల నుండి ప్రతి వినతిని స్వీకరించి, సమస్యల స్వభావాన్ని పరిశీలించారు. సంబంధిత శాఖల ద్వారా పరిష్కార చర్యలు చేపట్టేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రజావాణి కోసం అధికారులు శాఖల వారీగా ప్రత్యేక డెస్క్‌లు, హెల్ప్ డెస్క్‌లు , తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 10,753 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు సమర్పించిన వినతులను నేరుగా స్వీకరించడంతో పాటు, ఆ సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించడం , పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. సగటున ఒక్కో జిల్లాకు 164 వినతులు స్వీకరించబడ్డాయి. జిల్లాల వారీగా అత్యధిక సంఖ్యలో వినతులు స్వీకరించిన జాబితాలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 704 వినతిపత్రాలు స్వీకరించబడ్డాయి.

అదేవిధంగా, మండలానికి సగటున అత్యధిక సంఖ్యలో వినతి పత్రాలను స్వీకరించడంలో కూడా కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మండలానికి సగటున 47 వినతిపత్రాలు అందాయి. మండల స్థాయిలోనే ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలను స్వీకరించడం ద్వారా, సమస్యల పరిష్కార ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మండల స్థాయి ప్రజావాణి ద్వారా, ప్రజలు తమ సమస్యలను స్థానిక స్థాయిలోనే సంబంధిత అధికారులకు వివరించే అవకాశం లభించింది; దీనివల్ల పరిష్కారాల కోసం జిల్లా లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ప్రజల నుండి స్వీకరించిన వినతిపత్రాలను సంబంధిత శాఖలకు పంపడం, వాటిని సమీక్షించడం మరియు వీలైనంత త్వరగా పరిష్కరించడం వంటి చర్యలను అధికారులు చేపడుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!