పేద‌ల‌కు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తాం

ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక ఆస్ప‌త్రి ప్రారంభిస్తాం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్ , ఎల్బీ నగర్ టిమ్స్ , వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామ‌న్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి చొప్పున ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా పోటీ పడలేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సన‌త్ న‌గ‌ర్ లో టిమ్స్ ను ప్రారంభించిన సంద‌ర్బంగా ప‌లు కీల‌క అంశాలు వెల్ల‌డించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ , వరంగల్ ఆసుపత్రులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించామని చెప్పారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే, పేదలకు 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలలో భరోసాను కల్పిస్తుందన్నారు సీఎం. ఎయిమ్స్ తో పోటీప‌డే నిమ్స్ ఆస్ప‌త్రి తరహా సేవలను అందించేలా, ప్రతి ఆసుపత్రికి ఒక డైరెక్టర్‌ను నియమించి వారి పర్యవేక్షణలో అభివృద్ధి చేస్తాం అన్నారు. దీనికి అవసరమైన నిధులను కేటాయించడమే కాకుండా, ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా అధిగమించలేని విధంగా వీటిని నిర్వహిస్తాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఆసుపత్రులకు వచ్చేవారికి ఉచిత భోజన సదుపాయం కల్పించాలన్నారు. రోగుల సహాయకులు బస చేయడానికి డార్మిటరీలు, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీనికి అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు, ఇక్కడ సూపర్ పీజీ , నర్సింగ్ కళాశాలను కూడా మంజూరు చేయాలని ఆదేశించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య , ఆరోగ్య రంగాలను అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకు వెళుతున్నామ.ని పేర్కొన్నారు సీఎం. విద్యా రంగంలో వచ్చిన సమూల మార్పులు అందరికీ తెలిసినవే. నర్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు ఇప్పటి వరకు కేవలం మధ్యప్రాచ్య దేశాలలోనే సేవలు అందిస్తున్నారు . భవిష్యత్తులో జర్మన్, జపనీస్ , కొరియన్ భాషలు నేర్చుకోవడం ద్వారా వారు ఆయా దేశాలలో వేలాది ఉద్యోగ అవకాశాలను పొందే ఛాన్స్ ఉంటుంద‌న్నారు.

ఇప్పటివరకు ఆరోగ్య శాఖలో 16,000 మంది సిబ్బందిని నియమించామ‌ని, ఇంత భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. పేదల ఆరోగ్యాన్ని మేము మా బాధ్యతగా భావిస్తున్నాం. విద్యలో పెట్టుబడి అయినా లేదా ఆరోగ్యానికి కేటాయించిన నిధులైనా, వాటిని తాము కేవలం ఖర్చులుగానో లేదా సంక్షేమ పథకాల కిందనో చూడడం లేద‌న్నారు. వాటిని భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులుగానే పరిగణిస్తామన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!