త్వరలోనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తాం
కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఓటర్లకు సంబంధించి ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి , ఎన్. శంకర్, డిప్యూటీ జి.ఎస్. చారి, నోడల్ అధికారులు , సీఈఓ తెలంగాణ కార్యాలయానికి చెందిన ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఈఓ మాట్లాడారు. SIR-2026లో భాగంగా 25 జూన్ 2026 నుంచి 10 ఆగస్టు 2026 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు .ముఖ్యమైన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఎలక్టర్ల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలు (EFs) 2.65 కోట్లు అంటే మొత్తం ఎలక్టర్లలో 78.30 శాతం ఉన్నట్లు తెలిపారు. అలాగే మరణించిన ఎలక్టర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని/గైర్హాజరైన ఎలక్టర్లు, ఇతర కేటగిరీలకు చెందిన వారు అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల్లో నమోదైన ఎలక్టర్లకు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అలాగే 17 ఆగస్టు 2026 నుంచి 16 సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించనున్న క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దశ కోసం చేపట్టిన ఏర్పాట్లను కూడా సీఈఓ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
సర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసి, పలు పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి నుంచి వచ్చిన సలహాలను స్వీకరించి పరిశీలిస్తామన్నారు.అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్) హార్డ్ డిస్క్ ద్వారా అందజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ) పరిశీలనలో , క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలని సీఈఓ కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని తద్వారా ఓటర్ల జాబితా ఖచ్చితమైనదిగా, సమగ్రంగా, పారదర్శకంగా, లోప రహితంగా ఉంటుందని దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
