రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలు

శాసనసభలో వెల్ల‌డించిన మంత్రి ఎస్. సవిత

అమరావతి : రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. వర్షా కాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. ఆరు బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. 50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్లను గురుకులాల్లో విలీనం చేస్తున్నామన్నారు ఎస్. స‌విత‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత ఏపీలో 32 బీసీ గురుకులాలు మాత్రం ఉన్నాయని, 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. వాటిలో 25 ఎంజేపీలకు శాశ్వత భవనాల కోసం రూ.40 కోట్లను ఆనాడు మంజూరు చేయగా, 70 నుంచి 80 శాతం మేర పనులు సైతం పూర్తయ్యాయని అన్నారు. తరవాత వచ్చిన ప్రభుత్వం బీసీ గురుకులాలను పట్టించు కోకుండా గాలి కొదిలేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తి గా నిలిచిపోయిన భవనాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. . గోనబావి, మడకశిర, రొద్దం, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో ఉన్న గురుకులాల పనులు పున: ప్రారంభించామని, త్వరలోనే వాటిని పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని ప్ర‌క‌టించారు స‌విత‌.

Leave A Reply

Your Email Id will not be published!