చరిత్రలో బీసీలు మరిచి పోలేని రోజు : ఎస్. స‌విత

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పన

అమరావతి : చరిత్రలో ఈరోజు బీసీలు మరిచిపోలేని రోజు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు కాబోతున్నాయి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సంతోషం వ్యక్తంచేశారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు జగన్ ప్రభుత్వం కోత పెట్టడం వల్ల 16 వేలకు పైగా పదవులకు బీసీలు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల బిల్లు చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీసీల పక్షపాత్రి ప్రభుత్వం తమదని మరోసారి రుజువైందన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామని అన్నారు ఎస్. స‌విత‌.

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పించాలని నిర్ణయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై మంత్రి మండలిలో ఆమోదించామన్నారు. అసెంబ్లీలో కూడా ఆమోదిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మొట్ట మొదటిసారిగా 1994లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనతో బీసీలకు రాజ్యాధికారంలో అవకాశం కలుగుతుందన్నారు. తమను తాము పాలించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!