రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలి

చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి

హైద‌రాబాద్ : రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాన రంగానికి కొత్త దిశను చూపే చారిత్రాత్మక ఘట్టంగా ఈ పరిశోధనా సముదాయం నిలుస్తుందని అన్నారు.ఇప్పటి వరకు విశ్వవి ద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల్లో ఎన్నో విలువైన పరిశోధనలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు రైతులకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని మంత్రి అన్నారు. గతంలో పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడానికి రేడియో, టెలివిజన్ వంటి పరిమిత మార్గాలు ఉండేవని, ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి శక్తివంతమైన మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పరిశోధనల ఫలితాలను వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సోషల్ మీడియా ద్వారా రైతులకు చేరేలా శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యవసాయ భూమిలో ఉద్యాన పంటలు సుమారు 6 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 26 శాతం, సుమారు రూ.30,346 కోట్లుగా ఉందని తెలిపారు. ఉద్యాన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున పరిశోధన, సాంకేతికత, విస్తరణ సేవలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండటం ఆందోళనకరమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోనే డిమాండ్ ఉన్న కూరగాయలు, ఉద్యాన పంటలను పండించేలా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్లను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు ప్రత్యక్షంగా పంటలను, దిగుబడులను, ఆదాయ అవకాశాలను చూసి నేర్చుకునేలా ఫీల్డ్ డెమాన్‌స్ట్రేషన్లు నిర్వహిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.

చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న రైతులేనని, రెండు మూడు ఎకరాల భూమి కలిగిన రైతులు ఖరీదైన యంత్రాలు లేదా భారీ పెట్టుబడులతో కూడిన సాంకేతికతను స్వయంగా స్వీకరించలేరని అన్నారు. అందువల్ల తక్కువ ఖర్చుతో, చిన్న కమతాల్లో అమలు చేయగల సాంకేతికత, యంత్రాలు, సాగు పద్ధతులపై పరిశోధనలు జరగాలని సూచించారు .రైతుల జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపేలా గ్రామీణ యువతలో ఉన్న సృజనాత్మకతను కూడా ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువత తమ తల్లిదండ్రుల కష్టాలను తగ్గించేందుకు స్వయంగా యంత్రాలు, పరికరాలను రూపొందిస్తున్నారని, ఇలాంటి ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆయిల్‌పామ్‌తో పాటు కోకో, జాపత్రి తదితర అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. రైతులు ప్రత్యక్షంగా చూసి నేర్చుకునేలా ఈ పద్ధతులను పరిశోధనా కేంద్రాలు, డెమాన్‌స్ట్రేషన్ ఫారాల్లో ప్రదర్శించాలని సూచించారు . ఉద్యాన పరిశోధనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా రైతుల పొలాల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అన్నారు. కూరగాయలు, పూలు, ద్రాక్ష, ఔషధ, సుగంధ పంటలపై పరిశోధనలను ఒకే గొడుగు కింద సమన్వయం చేసేందుకు హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం కీలకమైన ముందడుగు అని తెలిపారు. ఉద్యాన పంటల్లో ఉత్పత్తి పెంచడంతో పాటు పంట అనంతర నష్టాలను తగ్గించడంపైనా పరిశోధనలు అవసరమని మంత్రి చెప్పారు. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోవడం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా పంట అనంతర నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనల మేరకు సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించేలా పరిశోధనా సంస్థలు, వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను అందించ గలిగితే దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తెలంగాణ పంటలకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు.
నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాగు పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు విధానాలు భవిష్యత్ వ్యవసాయానికి ఎంతో అవసరమని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను పరిశోధించి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు.

యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా తమ కార్యకలాపాలను విస్తరించాలని మంత్రి కోరారు. ప్రభుత్వానికి చెందిన సీడ్‌ ఫారాలు, ఇతర అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకొని జిల్లాల వారీగా పరిశోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రైతులు తమ ప్రాంతంలోనే కొత్త పంటలు, ఆధునిక సాగు పద్ధతులను ప్రత్యక్షంగా చూసి స్వీకరించే అవకాశం కల్పించాలని అన్నారు. . వ్యవసాయమే భవిష్యత్తు అని మంత్రి పేర్కొన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు దాదాపు నిలిచి పోయినా రైతు వ్యవసాయాన్ని మాత్రం ఆపలేదని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు వ్యవసాయాన్ని మరింత ఆకర్షణీయమైన, లాభదాయకమైన వృత్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ తదితర అనుబంధ రంగాలన్నీ రైతు కేంద్రంగా పనిచేయాలని, రైతు కష్టాన్ని ఎలా తగ్గించాలి, ఆదాయాన్ని ఎలా పెంచాలి అనే దృక్పథంతో పరిశోధనలు, విధానాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!