పాకిస్తాన్ : కంటి పరీక్ష కోసం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరోగ్యం , భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకుని మాజీ ప్రధానిని ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని పేర్కొంది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటి సమస్యకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. 73 ఏళ్ల ఖాన్ కంటి చూపు దాదాపు సాధారణ స్థితికి చేరుకుందని జైలు అధికారులు తెలిపిన మరుసటి రోజే ఈ ఆదేశం వెలువడింది. ఈ ఏడాది ప్రారంభంలో బయటపడిన కంటి సమస్యకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారిస్తున్న సమయంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న చికిత్స పట్ల సంతృప్తి లేదని పేర్కొంటూ, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
జస్టిస్ షాహిద్ వహీద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, ఖాన్‌ను రాబోయే కొద్ది రోజుల్లో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని ఆదేశించింది. ప్రాథమిక హక్కులను దృష్టిలో ఉంచుకుని, ఖైదీ ఆరోగ్యం , భద్రతను నిర్ధారించడానికి మేము ఈ ఆదేశాన్ని జారీ చేస్తున్నామని జస్టిస్ వహీద్ పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి జైలులో ఉన్న మాజీ క్రికెటర్-రాజకీయ నాయకుడు ఖాన్‌కు, జనవరి చివరలో ‘రైట్ సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్’ అనే కంటి సమస్య ఉన్నట్లు తేలిన తర్వాత, కంటి చికిత్స కోసం పలుమార్లు ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఖాన్ అనారోగ్య సమస్య బయట పడినప్పటి నుండి ఆయనకు సరైన చికిత్స అందించామని అడియాలా జైలు అధికారులు తెలిపారు.
డాక్టర్ ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ , రావల్పిండిలోని అల్-షిఫా ట్రస్ట్ ఐ హాస్పిటల్‌కు చెందిన విట్రియో-రెటినల్ సర్జన్ డాక్టర్ నదీమ్ ఖురేషీ ఆయనకు చికిత్స అందించారని నివేదిక పేర్కొంది. దీని ఫలితంగా, ఆయన కంటి పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది . చూపు దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది అని నివేదిక పేర్కొంది.
