చెన్నై : తమిళ జాతీయవాద సదస్సు తీర్మానాలను సీఎం విజయ్‌కు సమర్పించింది వీసీకే పార్టీ. తమిళనాడు ప్రభుత్వం తరపున రాష్ట్ర స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను చేపట్టాలని ముఖ్యమంత్రి విజయ్ను కోరినట్లు వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ తెలిపారు. అలాగే కేంద్రం నుండి మరింత రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ఆయన మద్దతు కోరినట్లు వీసీకే అధ్యక్షుడు చెప్పారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం తరపున చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమిళ జాతీయవాద సదస్సులో ఆమోదించిన తీర్మానాలను సమర్పించామని వెల్లడించారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించినట్లు తెలిపారు ఎంపీ .
తమిళనాడు ప్రభుత్వం తరపున రాష్ట్ర స్వయంప్రతిపత్తి హక్కులను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గట్టిగా కోరాల్సి ఉంది అని తిరుమావళవన్ అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త రాజకీయ కూటమిపై చర్చలు జరుగుతాయని సూచిస్తూనే తాము ‘తమిళగ వెట్రి కళగం’ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. కొత్త కూటమి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయ తరలింపునకు సంబంధించిన రూ. 5.54 కోట్ల విలువైన టెండర్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడు శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. టెండర్ నోటిఫికేషన్ 13వ తేదీన వార్తాపత్రికలలో ప్రచురితమైనప్పటికీ, అధికారిక వెబ్సైట్లో మాత్రం నాలుగు రోజుల తర్వాత అప్లోడ్ చేశారని ఆరోపిస్తూ డీఎంకే ఎమ్మెల్యే ఈ.వి. వేలు టెండర్ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు.
పత్రికా కథనాలు అవాస్తవమని, టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పేర్కొంటూ ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. కాంట్రాక్టర్లు బిడ్ల ధరలను అడ్డగోలుగా పెంచకుండా ఉండేందుకు ప్రభుత్వం పాత ధరల పట్టికను ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు; అలాగే టెండరింగ్ విధానాలపై సమగ్ర శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో సమర్పిస్తామని చెప్పారు. మంత్రి పర్యవేక్షణ లేకుండా ఏ టెండర్‌నూ జారీ చేయలేమని అర్జున మరోసారి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
