స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి
పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ దిశా నిర్దేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, ఇప్పటి నుంచే జన సైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా సత్తా చాటాలని, అన్ని చోట్లా విజయం సాధించాలని దిశా నిర్దేశం చేశారు జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా కీలక సూచనలు చేశారు. మన శ్రేణుల పోరాట పటిమ ఎంతో విలువైనది. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి సందర్భంలో బలంగా నిలిచి ప్రజా పక్షం వహించారు. రాష్ట్రంలో 2019-2024 మధ్య ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనసేన శ్రేణులు 2021 స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డాయి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదపడ్డాయని గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని అన్నారు పవన్ కళ్యాన్.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎంత దారుణంగా చేశారో? ఆ సమయంలో కూడా ధైర్యంగా, దాడులను, ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడ్డారు. ఆ స్ఫూర్తికి విలువ ఇచ్చేలా ఈసారి జనసేన నిలబడుతుందన్నారు. ఇప్పటి స్థానిక ఎన్నికల్లో జనసేన ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన ఫలితం ఉంటుందని, ఈ విషయం నేతలు, ప్రజా ప్రతినిధులు, శ్రేణులు గుర్తుంచు కోవాలన్నారు. అప్పటి దాష్టీక పాలనను ముగించేందుకే జనసేన 21 సీట్లకు పరిమితమై పోటీ చేసిందన్నారు. ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే. స్థానిక ఎన్నికలకు ప్రాంతాలవారీగా ఆ ప్రాంత రాజకీయ, సామాజిక పరిస్థితులనుబట్టి వ్యూహాలు ఉంటాయన్నారు పవన్ కళ్యాన్ కొణిదల.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన విధివిధానాలు రూపకల్పన చేస్తూ, క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలు పరిగణనలోకి తీసుకొంటూ ముందుకు వెళ్ళేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. 9 నుంచి 11 మంది వరకూ ఈ కమిటీలో ఉండేలా చూస్తామన్నారు.
