గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్ గా హైద‌రాబాద్

విద్యా సంస్థలతో తెలంగాణ కీలక ఒప్పందాలు

హైద‌రాబాద్ : హైదరాబాద్‌ను దేశంలోనే అతి పెద్ద గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను హైదరాబాద్‌కు తీసుకు రావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం బ్రిటన్‌, అమెరికాలో పర్యటించింది. ఆగస్టు 19 నుంచి 29 వరకు జరిగిన ఈ పర్యటనలో పలు ప్రముఖ విశ్వ విద్యాలయాలతో కీలక చర్చలు జరిగాయి. పలు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు, లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌లు సైతం కుదిరాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శాంతకుమారి, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు, సీఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌. శ్రీధర్‌ తదితర ఉన్నతస్థాయి అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు

సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, తయారీ రంగాల్లో ఇప్పటికే హైదరాబాద్‌ కీలక కేంద్రంగా ఉంది. రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లోనూ నగరం వేగంగా ఎదుగుతోంది. ఈ బలాన్ని మరింత పెంచేలా ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను హైదరాబాద్‌కు తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలోని ప్రముఖ నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ, ఇంగ్లండ్‌లోని 17 స్వతంత్ర విద్యా సంస్థల సమాఖ్య అయిన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్ భార‌త్ లో తమ తొలి ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నాయి. నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించడం గమనార్హం. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ కూడా త్వరలో హైదరాబాద్‌లో క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది.

ప్రపంచ ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (LSE), స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (SOAS) ప్రతినిధులతో తెలంగాణ బృందం విస్తృతంగా చర్చలు జరిపింది. హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడం, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం పెంచడం, బోధనా పద్ధతులను మెరుగుపరచడం, కొత్త తరహా తరగతి గది విధానాలను తీసుకురావడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సంస్థలు తమ బృందాలను హైదరాబాద్‌కు పంపించి ఇక్కడ విద్యా కేంద్రాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించేందుకు అంగీకరించాయి. తమ అధ్యాపకులు హైదరాబాద్‌లో ఉండి విద్యా కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా హైదరాబాద్‌లో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు నిర్వహించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, కార్పొరేట్‌ సంస్థల సీనియర్‌ అధికారుల కోసం ఈ కోర్సులను డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్‌ బృందం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ , లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, సీనియర్‌ అధ్యాపకులతో చర్చలు జరిపింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో రాష్ట్రంలో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిగాయి.

బ్రిటన్‌, అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశమై పర్యటనలో జరిగిన చర్చలు, సాధించిన పురోగతిని సమీక్షించారు. ప్రపంచస్థాయి నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలను హైదరాబాద్‌కు తీసుకు రావాలని సూచించారు. అవసరమైన చోట ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రపంచ స్థాయి విద్యాసంస్థల సర్టిఫికెట్‌ కోర్సులు, ప్రత్యేక కోర్సులు హైదరాబాద్‌లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

అమెరికా పర్యటనలో తెలంగాణ బృందం నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్జీనియా టెక్‌ తెలంగాణలో పరిశ్రమలకు అవసరమైన, భవిష్యత్తు ఉద్యోగాలకు ఉపయోగపడే విద్యా విధానాలను తీసుకురావడంపై సహకరించనుంది. విద్యా శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పిల్లలు, యువతకు విద్య, నైపుణ్యాలు, క్రీడలను తన ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా పెట్టుకున్నారు. నర్సరీ నుంచి కేజీ, ప్రాథమిక, హైస్కూల్‌ వరకు విద్యా వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు నైపుణ్య శిక్షణ, క్రీడా విద్యను కూడా బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో భారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!