చెన్నై : ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీకి తమ పార్టీ తరపున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హర్షం వ్యక్తం అవుతుండగా ఇతర పార్టీలలో విస్మయం వ్యక్తం అవుతోంది. మరో వైపు ఇటీవలే ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలవగా రెండో స్థానంలో రాహుల్ గాంధీ , మూడో ప్లేస్ లో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నిలిచారు. తనను ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటూ ప్రకటనలు చేయవద్దని తన మంత్రులు, పార్టీ నేతలకు సూచించాలని వైకో విజయ్ను కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ‘తమిళగ వెట్రి కళగం’ అధినేత , ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పేరును ప్రతిపాదించే అవకాశం లేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో స్పష్టం చేశారు.
ఈ కూటమికి రాహుల్ గాంధీనే “ఖచ్చితమైన” ఎంపిక అని ఆయన నొక్కి చెప్పారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ తప్ప మరొకరికి అవకాశం లేదని పేర్కొన్నారు. విజయ్‌కు కూడా అటువంటి ఆశయం ఉన్నట్లు తనకు అనిపించడం లేదన్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేనప్పటికీ టీవీకే ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇచ్చిన తొలి మిత్రపక్షాలలో కాంగ్రెస్ ఒకటి; కాగా, విజయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించే ఈ చర్య కాంగ్రెస్ నేతలలో అసహనానికి దారితీసింది. కన్యాకుమారి జిల్లాలోని మార్తాండం సమీపంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించక పోతే తాను, ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ టీవీకే ప్రభుత్వం నుండి వైదొలగాల్సి ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి రాజేష్ కుమార్ హెచ్చరించారు. అదే రోజు తిరుచిరాపల్లిలో మాట్లాడిన విశ్వనాథన్ కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.
