డేటా అనలటిక్స్‌తో మరింత సమర్దంగా పౌర సేవలు

ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విస్తృత ప్రచారం

అమరావతి : ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగు పరచాలని, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ సహా వివిధ అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తాను 20 సార్లు పాల్గొన్నానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పరిశుభ్రత అంశాలపై ప్రజల్లో మరింత లోతైన అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో శానిటేషన్ నిర్వహించే విషయంలో ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో మెరుగ్గా శానిటేషన్ నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతీ నెలా మొదటి ఆదివారం రోజున విద్యార్ధుల తల్లిదండ్రుల్ని ఆహ్వానించి హాస్టళ్లలో పరిస్థితులు, ఆహారం, తాగునీరు తదితర అంశాలపై వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అన్నా క్యాంటీన్ల ద్వారా దాతలు అన్నార్తులకు సాయం అందించే అంశాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని లోటు పాట్లను సవరించు కోవాలని సీఎం నిర్దేశించారు. బాధ్యులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి కృష్ణా నది జలాలు రావటంతో ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమైందని.. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ ఆన్ లైన్ లో సేవలు అందించాలని సమీకృత సేవల విధానం ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ సహా వివిధ విభాగాలు అన్ని ధృవపత్రాలనూ ఆన్ లైన్ లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవేర్ ద్వారా రాష్ట్రంలో సాగు స్థితిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రైతులకు సూచనలు జారీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రకృతి సేద్యం పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటలు కాపాడుకోడానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. భూమిని నిరుపయోగంగా ఉంచకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. 5.70 లక్షల ఎకరాల్లో ప్రతీ ఎకరాను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు .

Leave A Reply

Your Email Id will not be published!