నూత‌న విధానంతో భ‌క్తుల‌కు వేగంగా ల‌గేజీ సేవ‌లు

అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి కీల‌క ప్ర‌క‌ట‌న

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లగేజీ నిర్వహణ వ్యవస్థలో తీసుకు రానున్న మార్పులపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు నూతన విధానం గురించి అదనపు ఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆధునిక BLE 5.1 సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించిన ఈ విధానంలో భక్తుల లగేజీని స్వీకరించినప్పటి నుంచి తిరిగి అందజేసే వరకు ప్రతి దశను సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని వివరించారు. ఈ విధానం ద్వారా అలిపిరి వద్ద భక్తుల లగేజీని స్వీకరించడం, ట్యాగ్‌ను అనుసంధానం చేయడం, వాహనాల ద్వారా తిరుమలకు తరలించడం, జీఎన్‌సీ వద్ద లగేజీని నిల్వ చేయడం, భక్తులు లగేజీని తిరిగి తీసుకునే వరకు మొత్తం ప్రక్రియను ఎండ్‌-టు-ఎండ్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు సుమారు 12 వేల బ్యాగులను, రద్దీ సమయాల్లో గంటకు సుమారు 1,800 బ్యాగులను నిర్వహించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు.

ప్రతి లగేజీకి BLE ట్యాగ్‌ను అనుసంధానం చేయడం ద్వారా అది ఏ ప్రాంతంలో ఉందో నిరంతరం గుర్తించే విధానం, భక్తులు లగేజీని తిరిగి పొందే సమయంలో క్యూలను తగ్గించేందుకు ముందస్తు రిక్వెస్ట్ చేసే విధానాన్ని జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. జీఎన్‌సీకి సుమారు 100 మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు కియోస్క్ లేదా మొబైల్ యాప్ ద్వారా లగేజీ కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేరుగా కౌంటర్ వద్ద కూడా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలిపిరి నుంచి జీఎన్‌సీ వరకు లగేజీ తరలింపును కూడా డిజిటల్ మానిఫెస్ట్, GPS తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని ప్రతిపాదించారు. లగేజీ నిర్వహణకు సంబంధించిన ఆక్యుపెన్సీ, భక్తుల రాకపోకలు, రద్దీ, సేవల స్థితి తదితర అంశాలను ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ నూతన లగేజీ నిర్వహణ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో టీటీడీ ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు, వీజీఓ సురేంద్ర , ఇతర అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!