చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై అరుదైన రికార్డు నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలో 1.04 కోట్ల మంది ఈ మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చేశారు. ఇది ఎవరూ ఊహించ లేదని మెట్రో నిర్వణ సంస్థ వెల్లడించింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ఇందుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. ఆగస్టు నెలలో చెన్నై మెట్రోలో మొత్తం 1,04,04,098 మంది ప్రయాణించారు. ఇందులో ఆగస్టు 14న అత్యధికంగా ఒకే రోజులో 4,01,607 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేసిన ‘సింగిల్-జర్నీ పేపర్ క్యూఆర్ (QR) టిక్కెట్ల’ ద్వారా 20,20,687 ప్రయాణాలు జరగగా, స్టేషన్లలో జెనరేట్ చేసిన ‘స్టాటిక్ క్యూఆర్ టిక్కెట్ల’ను 2,28,732 మంది ప్రయాణికులు వినియోగించు కున్నారు. టికెటింగ్ విధానాలలో ఎన్సీఎంసీ సింగార చెన్నై కార్డ్ అత్యధికంగా వినియోగించారని మెట్రో సంస్థ తెలిపింది.
దీని ద్వారా నెలలో 52,84,196 ప్రయాణాలు నమోదయ్యాయి. డిజిటల్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఓఎన్డీసీ ద్వారా 12,47,168 మంది, ఆ తర్వాతి స్థానంలో వాట్సాప్ టికెటింగ్ ద్వారా 4,69,198 మంది ప్రయాణించారు. ‘చెన్నై వన్ యాప్’ ద్వారా 3,10,474 మంది ప్రయాణించగా, పేటీఎం , ఫోన్‌పే ద్వారా వరుసగా 3,09,569 , 2,73,438 మంది ప్రయాణించారు. సీఎంఆర్ఎల్ మొబైల్ యాప్‌లోని ‘స్టోర్ వాల్యూ పాస్’ను 1,04,251 మంది ప్రయాణికులు ఉపయోగించగా, ఆన్లైన్ టికెటింగ్ ద్వారా 1,56,385 ప్రయాణాలు జరిగాయి. ఎన్సీఎంసీ కార్డ్ , డిజిటల్ QR-ఆధారిత టికెటింగ్ సేవలను వాట్సాప్ , పే టీఎం, ఫోన్ పే, గూగుల్ పే , సీఎంఆర్ఎల్ మొబైల్ యాప్ ద్వారా లభించే డిజిటల్ స్టోర్ వాల్యూ పాస్‌తో సహా ఉపయోగించి బుక్ చేసుకునే ప్రయాణాలపై ప్రస్తుతం 20 శాతం రాయితీని అందిస్తోంది. అయితే, టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసే సింగిల్-జర్నీ పేపర్ క్యూ ఆర్ టికెట్లకు ఈ రాయితీ వర్తించడం లేదు.
