చెన్నై : యావత్ ప్రపంచం మెచ్చిన భారత్ కు చెందిన అరుదైన సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ (ఏఆర్ రెహమాన్ ). ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తర్వాత సూఫీ మతంలోకి మారాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ప్రాణం పోశాడు. తనదైన సంగీతంతో ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతూ వస్తున్నాడు. ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నాడు. ఆపై అత్యుత్తతమని భావించే , ప్రతి కళాకారుడు కోరుకునే ఆస్కార్ అవార్డు స్వంతం చేసుకున్నాడు. తాజాగా ఏఆర్ రెహమాన్ సంచలన ప్రకటన చేశాడు. త్వరలోనే తాను ఆత్మకథ రాస్తున్నట్లు తెలిపాడు. ఈ పుస్తకం పేరు ‘రెహమాన్: ఎ రినైసాన్స్’ పుస్తకాన్ని రూప చక్రవర్తితో కలిసి రెహమాన్ రచించనున్నారు. రెహమాన్ సోషల్ మీడియా వేదికగా తన ఆత్మకథపై పని చేస్తున్నట్లు వెల్లడించారు.
‘రెహమాన్: ఎ రినైసాన్స్’ అనే పేరుతో రాబోతున్న ఈ పుస్తకానికి అంతర్జాతీయ రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రూప చక్రవర్తి సహ-రచయితగా వ్యవహరించనున్నారు. ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ‘రెహమాన్: ఎ రినైసాన్స్’ కోసం రూప చక్రవర్తి నేను సహ-రచయితలుగా కలిసి పనిచేస్తున్నామని వెల్లడించాడు స్వయంగా. నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు , సృజనాత్మక ప్రయాణం గురించి ఈ పుస్తకం లోతుగా వివరిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాడు అకాడమీ అవార్డు విజేత అయిన రెహమాన్. పుస్తకం పేరు ఖరారైనప్పటికీ, ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతోందని, కొన్ని నెలల్లో మరిన్ని వివరాలు పంచుకుంటామని రెహమాన్ తెలిపారు. రెహమాన్ సంగీత ప్రయాణం చాలా చిన్న వయసులోనే మొదలైంది. 11 ఏళ్ల వయసులో ఆయన మాస్టర్ ధనరాజ్ వద్ద శాస్త్రీయ శిక్షణ ప్రారంభించారు.
పాఠశాల రోజుల్లోనే ఆయన కీబోర్డ్ వాయించడం, ‘రూట్స్’ వంటి బ్యాండ్‌లకు సంగీత సమన్వయం చేయడం వంటివి చేసేవారు. త్వరలోనే ఆయన అనుభవజ్ఞులైన సంగీత దర్శకులతో కలిసి పని చేయడం ప్రారంభించారు; అంతేకాకుండా కున్నక్కుడి వైద్యనాథన్ , జాకీర్ హుస్సేన్ వంటి దిగ్గజాలతో కలిసి ప్రపంచ పర్యటనలలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత, డాక్యుమెంటరీలు, వాణిజ్య ప్రకటనల జింగిల్స్, భారతీయ టెలివిజన్ ఛానెళ్ల కోసం స్వతంత్రంగా సంగీతం సమకూర్చడం మొదలుపెట్టారు. 1992లో వచ్చిన ‘రోజా’ చిత్రం ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రస్థానం చరిత్రగా నిలిచి పోయింది.
