ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై స‌ర్వే

సాకారం కానున్న తీర ప్రాంత వాసుల క‌ల

అమ‌రావ‌తి : ఉప్పాడ తీర ప్రాంతపు వాసుల క‌ల తీరే రోజు రానుంది. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది . తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు.

తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితో పాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్‌లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది . ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగ పడుతుంది.

ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసి పోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి.

Leave A Reply

Your Email Id will not be published!