ఏపీ రాష్ట్ర అవ‌స‌రాలు చంద్ర‌బాబుకు మాత్ర‌మే తెలుసు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఏం కావాల‌నే దానిపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఉన్నంత అవ‌గాహ‌న‌, శ్ర‌ద్ద‌, నిబ‌ద్ద‌త ఇంకెవ్వ‌రికీ లేద‌న్నారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. సోమ‌వారం మంగ‌ళ‌గిరి లోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. సిఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి వాటర్ మ్యాన్ , అపర భగీరధుడుగా చంద్రబాబు రూపాంతరం చెందడం మనకెంతో గర్వకారణం అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల వెనుకబాటుతనానికి నీటి వనరులు లేక పోవడమే అని చంద్రబాబు గుర్తించారన్నారు.

భారత దేశానికి ఇజ్రాయేల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని పరిచయం చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడేన‌ని పేర్కొన్నారు నిమ్మ‌ల రామానాయుడు. కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానంను ఆదర్శంగా తీసుకున్న దార్శనికుడు మ‌న సీఎం అని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి నీరందించి, సిరులు పండించడమే తన లక్ష్యం అని ప్రకటించి అమలు చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. మొదటి ఏడాదిలోనే హంద్రీనీవా ఫేజ్-1 పూర్తి చేసి 740 కి.మీ కృష్ణా జలాలను తీసుకెళ్ళాం అని, ఆ ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. 3 దశాబ్దాల కల వెలిగొండను జాతికి అంకితం చేసి వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల కలను నెరవేర్చారన్నారు.

2027 పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నార‌ని ఆ దిశగా ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు నిమ్మ‌ల రామానాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!