కేరళ : నాలుగు సార్లు జాతీయ అవార్డు, పద్మశ్రీ పురస్కారం పొందిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు ఇప్పుడు 75 ఏళ్లు. తన అద్భుత నటన, బిన్నమైన శైలితో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తన పుట్టినరోజును జరుపు కోవడంతో పాటు తన తాజా చిత్రం ‘మేళా’ గురించి ప్రకటించారు. ఈ సందర్భంగా ‘మమ్ముట్టిస్ మేళా’ గా ప్రచారం పొందుతున్న ఈ మెగాస్టార్ తాజా చిత్రం పోస్టర్‌ను ఆయన నిర్మాణ సంస్థ విడుదల చేసింది. అభిమానులు, సినీ పరిశ్రమ సహచరులు , రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను మలయాళ సినిమా గర్వ కారణంగా అభివర్ణించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్లో మమ్ముట్టి ఐదు దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానం వెండితెరపై అద్భుతాలను సృష్టించిందని పేర్కొన్నారు.
అంతే కాదు భారతీయ సినిమాకే శాశ్వత స్ఫూర్తి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి పాత్ర ద్వారా నటనలోని అనంతమైన అవకాశాలను అన్వేషించే ప్రత్యేక ప్రతిభావంతుడిగా ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ ఆ నటుడిని కొనియాడారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో మెగాస్టార్ మరిన్ని వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోస్తూ తరాలను ఆశ్చర్య పరుస్తూనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ దినమని పేర్కొన్నారు. మమ్ముట్టి నిరంతర ప్రయోగాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రతిభావంతుడు అని అన్నారు. ‘పుజు’ , ‘భ్రమయుగం’, ‘కాథల్’ ‘కలంకవల్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు.
సూపర్ స్టార్ ఇప్పటికీ నటన పట్ల మక్కువతో ఉన్నారని , తాను ఇంకా చేయని పాత్రల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకునే సామర్థ్యం ఉన్న నటుడని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , నేమోమ్ ఎమ్మెల్యే రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మీ అంకితభావం, సాటిలేని వైవిధ్యం , మిమ్మల్ని మీరు నిరంతరం కొత్తగా మలుచుకునే సామర్థ్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు.
