మ‌హిళ‌ల‌ను దూషిస్తే స‌హించ‌ను..తాట తీస్తా

నిప్పులు చెరిగిన సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగారు. ఆయ‌న మహిళ‌ల గురించి కీల‌క కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎవ‌రైనా స‌రే మహిళలపై అసభ్యకరమైన భాషను వాడితే స‌హించ‌న‌ని, తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అది ప్ర‌తిప‌క్షాల కైనా లేక అధికారంలో ఉన్న త‌మ పార్టీతో ఇత‌ర కూట‌మిలో ఉన్న పార్టీల‌కైనా ఇది త‌ప్ప‌కుండా వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం .మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యక్తిగత దాడులు, ద్వంద్వార్థాలతో కూడిన అవమానాలు లేదా అసభ్యకరమైన భాష వాడకం వంటి చర్యలకు తక్షణమే కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత ఎదుర్కొన్న అవమానాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మహిళా ప్రముఖులకు సంబంధించిన వివాదాల మధ్య జరుగుతున్న వ్యక్తిగత దాడులను ఖండించారు.

ప్రజా మర్యాద, రాజకీయ నైతికతపై తన వైఖరిని నొక్కి చెప్పడానికి, ఆయన ఇద్దరు ప్రముఖ మహిళా వ్యక్తుల గురించి ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ ప్రస్తావించారు. మొదటిగా సభ చరిత్రలో అత్యంత చీకటి ఘట్టాలలో ఒకదానిని ఆయన గుర్తు చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 1989లో అసెంబ్లీలో దివంగత జయలలిత ఎదుర్కొన్న దుర్భాషలు , శారీరక అవమానాలను ప్ర‌స్తావించారు. అటువంటి అవమానకరమైన రాజకీయ సంప్రదాయాలు ఎప్పటికీ పునరావృతం కాకూడదని నొక్కిచెప్పారు. గతంలో జరిగిన వాటిని సాకుగా చూపి అసెంబ్లీలో విషపూరిత ప్రవర్తనను సమర్థించు కోలేమని ఆయన ప్రకటించారు. రెండవదిగా ఒక ప్రముఖ మహిళా నటికి సంబంధించిన ఇటీవలి రాజకీయ వివాదంపై స్పందిస్తూ ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై జరిగే వ్యక్తిగత, అసభ్యకరమైన దాడుల గురించి విజయ్ పరోక్షంగా తీవ్రంగా మందలించారు.

Leave A Reply

Your Email Id will not be published!