అమరావతి : దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గ్రామస్థాయి నుంచి అత్యంత బలమైన క్యాడర్, కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇంత బలమైన కార్యకర్తల వ్యవస్థ కలిగిన తెలుగుదేశం పార్టీలో పనిచేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరి అదృష్టమని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. రాజకీయాల్లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భగవంతుడు ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక రంగంలో అవకాశం కల్పిస్తారని మంత్రి అన్నారు.
ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 175 మందికి మాత్రమే ఎమ్మెల్యేలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని, అలాంటి అరుదైన అవకాశాన్ని పొందిన ప్రతి ఒక్కరూ దాని విలువను గుర్తించాలని సూచించారు.
పదవి రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన పదవిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమని అన్నారు. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. ఈ అవకాశం శాశ్వతం కాదు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని, దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. అలా పనిచేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం అని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు నిరంతరం మమేకమై ఉండాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించగలగడం సాధ్యం కాకపోయినా, కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని అన్నారు. ప్రజలకు ఏమీ చేయలేక పోయినా ఫర్వాలేదు.. కానీ వారిని ఇబ్బంది పెట్టడం, వేధించడం మాత్రం చేయకూడదని హితవు పలికారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని మంత్రి హెచ్చరించారు.
