మ‌హ‌నీయుడు ‘స‌ర్ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌’

ఘ‌నంగా నివాళులు అర్పించిన ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ : ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్ష‌గుండం విశ్వేశ్వరయ్యకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్ర‌శంసించారు. ఇదే క్ర‌మంలో దేశ నిర్మాణ దార్శనికతను ఈ సందర్భంగా మోదీ స్మరించుకున్నారు. అలాగే ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన , మెరుగైన భవిష్యత్తు కోసం పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేస్తున్న కృషిని కూడా ప్ర‌స్తావించారు. ఇదిలా ఉండ‌గా స‌ర్ విశ్వేశ్వ‌రయ్య ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణాల‌కు ఆద్యుడిగా భావిస్తారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇంజనీర్, పరిపాలకుడు, దూరదృష్టి కలిగిన దేశ నిర్మాణకర్త. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను భారతదేశంలో ఇంజినీర్స్ డేగా జరుపుకుంటారు.

ఆయ‌న పూర్తి పేరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 15 సెప్టెంబర్ 1861 లో పుట్టారు. ఆయ‌న స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిక్ బ‌ళ్లాపూర్ జిల్లాలోని ముద్దెన‌హళ్లి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా కష్టపడి చదువుకున్నారు. మొదట బెంగళూరులోని సెంట్ర‌ల్ కాలేజీలో చదివారు. అనంతరం పూణేలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1884లో బాంబే ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజ‌నీర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. విశ్వేశ్వరయ్య నీటి పారుదల, తాగునీరు, వరద నియంత్రణ రంగాల్లో అనేక ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పనిచేశారు. నీటి నిల్వ, వరద నియంత్రణకు ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థను అభివృద్ధి చేశారు. అప్పటి సింధ్ ప్రాంతంలో నీటి సరఫరా వ్యవస్థపై పనిచేశారు. 1908లో మూసీ వరదల తర్వాత హైదరాబాద్‌కు వరద నియంత్రణ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మైసూరు ప్రాంత అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటి కృష్ణ సాగ‌ర్ ప్రాజెక్టు. ఇది కూడా విశ్వేశ్వ‌రయ్య చ‌ల‌వే.

1912–1918 మధ్య మైసూరు సంస్థానానికి దివాన్‌గా పనిచేశారు. ఈ కాలంలో పారిశ్రామిక, విద్యా, ఆర్థిక రంగాల్లో అనేక సంస్కరణలకు ప్రోత్సాహం ఇచ్చారు. 1955లో భారత ప్రభుత్వం ఆయనకు “భారతరత్న” పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. విశ్వేశ్వరయ్య కేవలం ఇంజనీర్ మాత్రమే కాదు. భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని బలంగా నమ్మిన దూరదృష్టి గల వ్యక్తి.

Leave A Reply

Your Email Id will not be published!