ప‌ల్లెల అభివృద్దికి రహదారుల బలోపేతం కీలకం

ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి

అమ‌రావ‌తి : గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఎన్‌హెచ్‌-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్ల వ్యయంతో నాలుగు లేన్స్ రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మొత్తం 2.2 కిలోమీటర్ల మేర ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆత్మకూరు రహదారిని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు సాకారం కావడం ఎంతో సంతోషకరం. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో మొత్తం రూ. 8.91 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టాం అన్నారు.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ పనుల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 6.31 కోట్ల వ్యయంతో 2.2 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని విస్తరించిన‌ట్లు తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల ద్వారా రూ.2.60 కోట్లతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టనున్నాం అన్నారు. ఆత్మకూరు పట్టణ ప్రజలు నిత్యం జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-67కు చేరుకునేందుకు ఈ మార్గం పైనే ఆధార పడేవారని పేర్కొన్నారు. ఇరుకైన రహదారి, గుంతల కారణంగా స్థానికులు, విద్యార్థులు, రైతులు రాకపోకల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వార‌ని తెలిపారు డిప్యూటీ సీఎం. ఈ సమస్యను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టడంతో జాతీయ రహదారిని తలపించేలా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రహదారిని అభివృద్ధి చేశాం అన్నారు. ఈ రహదారి సమీపంలోని ఆలయంలో 50 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉందని, భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావాలకు ప్రతీకగా నిలిచిన ఈ విగ్రహం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, రహదారికి వాయుపుత్ర మార్గ్ అని నామకరణం చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!