అమరావతి : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందుకు సాగాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్వాగతించారు. నారీశక్తికి సముచిత గౌరవం కల్పించే ఈ చర్య దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా విధాన రూపకల్పనలో వారి భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని తెలిపారు.మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన దృక్పథం, సుదీర్ఘ నిబద్ధత ఉన్నాయని విజయ్ అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు, అంతకు మించి అవకాశాలు కల్పించేందుకు పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎదిగి, ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవం జాతీయ స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు స్ఫూర్తినిస్తుంది. ఇది ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగిన సందర్భం అని విజయ్ అన్నారు.
మహిళా ప్రాతినిధ్యాన్ని కేవలం స్థానాల కేటాయింపునకు పరిమితం చేయకుండా, సమర్థ నాయకత్వంగా తీర్చిదిద్దడం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వ శిక్షణ, సామర్థ్య వికాసం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాల ద్వారా మహిళా ప్రజా ప్రతినిధులను బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, తాగునీరు, జీవనోపాధి, సామాజిక సంక్షేమం వంటి అంశాల్లో మహిళల అనుభవం, దృక్పథం పాలనకు మరింత బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు.సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమర్థతను చాటుకున్నారని విజయ్ పేర్కొన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళల్లోని నాయకత్వ ప్రతిభ సమాజాభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. స్థానిక సంస్థల్లో పెరిగిన మహిళా నాయకత్వం, రాష్ట్ర , జాతీయ స్థాయిల్లోనూ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మహిళల క్రియాశీల భాగస్వామ్యం లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నది తెలుగుదేశం పార్టీ విశ్వాసమని విజయ్ స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. మహిళా రిజర్వేషన్లు సంఖ్యాపరమైన ప్రాతినిధ్యంతో పాటు, నిర్ణయాధికారంలో సమాన భాగస్వామ్యానికి దోహద పడాలని విజయ్ అన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల ప్రజా సమస్యలపై విస్తృత చర్చకు, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
