తిరుపతి : తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో ఈ యేడాది డిసెంబర్ 4వ తేదీ నుంచి జరగనున్న డిఎస్ జిపి/ఐజిఎస్ పి కాన్ఫరెన్స్-2026 కు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఈ సదస్సు నేపథ్యంలో ఐసర్ లో విద్యుత్ సరఫరా ఏర్పాట్లను సిఎండి పరిశీలించారు. అనంతరం సంస్థ డైరెక్టర్ (టెక్నికల్) కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) కే. సంపత్ కుమార్, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. చంద్రశేఖర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్న రెడ్డప్ప, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతోపాటు ‘మాన్’ ప్రతినిధులు, ఐసర్ లోని విద్యుత్ విభాగపు ప్రతినిధులతో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఐసర్ ప్రాంగణంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సదస్సు కోసం సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో 1,866 కిలోవాట్ల సామర్థ్యంతో పది ప్రాంతాల్లో ప్రత్యేకంగా 26 ట్రాన్స్ఫార్మర్లు, 47 జనరేటర్లు, 70 విద్యుత్ స్తంభాలు, 3.5 కి.మీ. మేరకు విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్ జరిగే సందర్భంలో సమావేశ హాలు, ఆఫీస్ కాంప్లెక్స్, వసతి సముదాయాలు, భోజనశాల, యోగ కేంద్రం తదితర ప్రాంగణాల్లో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు.
సదస్సు జరిగే సందర్భంలో విద్యుత్ సరఫరా నిర్వహణను సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. అదేవిధంగా సమావేశపు హాలు, వసతి సముదాయం, భోజనశాల, యోగా కేంద్రం తదితర ప్రాంగణాల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రతి ప్రాంగణానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో నోడల్ ఆఫీసర్ ను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు. మొత్తం 7 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 12 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 15 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో పాటు సిబ్బంది రోజూ రెండు షిఫ్ట్ లలో విధులు నిర్వహించాలని సూచించారు. ఆయా నోడల్ ఆఫీసర్లు అవసరమైన సిబ్బంది, సాంకేతిక బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.