తెలంగాణ అల్పాహార ప‌థ‌కానికి సింగ‌రేణి రూ. 61.44 కోట్లు

అభినందించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన ‘తెలంగాణ అల్పాహార పథకం’ కు మద్దతునిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని , ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఆకలిని తీర్చి, వారి విద్యాభ్యాసానికి తోడ్పడే ఈ పథకం కోసం సింగరేణి ₹61.44 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దేశానికి విద్యుత్తును అందించడమే కాకుండా, భావి తరాల విద్యాభివృద్ధికి తోడ్పడటం ద్వారా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను కూడా సింగరేణి నెరవేరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ అల్పాహార పథకం’ను అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల మార్గనిర్దేశంలో, సింగరేణి తన పరిధిలోని ప్రాంతాల్లో , ఇతర చోట్ల కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతను ‘హరే కృష్ణ ఫౌండేషన్’ చూసుకుంటుంది. ఇటువంటి 9 వంటశాలల నిర్మాణానికి సింగరేణి నిధులను కేటాయించింది. పూర్తిగా సింగరేణి సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ 9 వంటశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలల్లో చదువుతున్న 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందుతుంది.

మొదటి దశలో కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల కోసం సింగరేణి ₹2 కోట్లను మంజూరు చేసింది. దీనిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడి నుండి కొడంగల్‌తో పాటు సమీపంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారాన్ని అందిస్తున్నారు. తదుపరి దశలో మధిర, మంథని , మంచిర్యాల ప్రాంతాల్లో కూడా కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేశారు. వీటి కోసం సింగరేణి తన సీఎస్ఆర్ నిధుల నుండి ₹21.03 కోట్లను కేటాయించింది. అలాగే, కొత్తగూడెం, భూపాలపల్లి, కాగజ్‌నగర్ , మునగాల (సూర్యాపేట) ప్రాంతాల్లో త్వరలో నిర్మించనున్న వంటశాలల కోసం సంస్థ మరో ₹38.41 కోట్లను కేటాయించింది.

*పాఠశాలల్లో భోజన నిర్వహణను సులభతరం చేస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న ఈ కేంద్రీకృత వంటశాలల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రభుత్వ రంగ సంస్థగా, తన సీఎస్ఆర్ నిధులను సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడం ద్వారా సింగరేణి ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలకు పౌష్టికరమైన భోజనం అందించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గుతాయని, విద్యార్థుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!