జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవేత్త, తత్వవేత్త ఫ్రెడరిక్ ఎంగెల్స్ జయంతి సందర్భంగా స్మరణాంజలి. కార్ల్ మార్క్స్‌తో కలిసి మార్క్సిస్టు సిద్ధాంత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్. మార్క్సిజం అభివృద్ధిలో ఆయన చేసిన కృషి అపారమైనది. తాత్విక ఆలోచనలకే పరిమితం కాకుండా, కార్మికవర్గ జీవితాలను అధ్యయనం చేసి, వారి హక్కులు, విముక్తి, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవ మేధావి ఆయన. 1845లో ఎంగెల్స్ తన ప్రత్యక్ష పరిశీలనలు, పరిశోధనల ఆధారంగా **’ఇంగ్లాండులో కార్మికవర్గ స్థితిగతులు’ (The Condition of the Working Class in England) అనే పుస్తకాన్ని ప్రచురించారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న పేదరికం, దోపిడీ, దుర్భర జీవన పరిస్థితులను ఈ రచన ప్రపంచానికి పరిచయం చేసింది. 1848లో కార్ల్ మార్క్స్‌తో కలిసి చరిత్రాత్మకమైన ”కమ్యూనిస్టు ప్రణాళిక” (The Communist Manifesto) రచించారు. అనంతరం మార్క్స్ తన జీవితకాల కృషిగా భావించిన ‘దాస్ కాపిటల్’ రచనకు ఎంగెల్స్ ఆర్థికంగానూ, మేధోపరంగానూ అండగా నిలిచారు. మార్క్స్ మరణానంతరం ఆయన వదిలివెళ్లిన పరిశోధనా పత్రాలను క్రమబద్ధీకరించి, ‘దాస్ కాపిటల్’ రెండవ, మూడవ సంపుటాలను సంపాదకత్వం వహించి ప్రచురణకు తీసుకొచ్చారు.
ఫ్రెడరిక్ ఎంగెల్స్‌ను కొందరు ప్రపంచంలోని తొలి మార్క్సిస్టుగా అభివర్ణిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయన మార్క్స్‌కు కేవలం సహచరుడు మాత్రమే కాదు. మార్క్సిస్టు ప్రపంచ దృక్పథం రూపు దిద్దు కోవడంలో సమానమైన మేధోపరమైన భాగస్వామి. మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ పరస్పర సహకారంతో చారిత్రక భౌతికవాదం, మాండలిక భౌతికవాదం, వర్గపోరాట సిద్ధాంతాలకు పునాదులు వేశారు. అయితే మార్క్సిజం ప్రాథమిక ఆలోచనకు ప్రధాన సూత్రప్రాయ రూపకల్పన కార్ల్ మార్క్స్దేనని ఎంగెల్స్ స్వయంగా స్పష్టం చేశారు. 1883లో మార్క్స్ మరణించిన అనంతరం వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక జర్మన్ సంచికకు ఎంగెల్స్ రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మానవ సమాజ చరిత్రలో ఆర్థిక ఉత్పత్తి విధానం, దాని నుంచి ఏర్పడే సామాజిక నిర్మాణమే ఆయా యుగాల రాజకీయ, మేధోపరమైన చరిత్రకు పునాది. భూమిపై ఆదిమ సామూహిక యాజమాన్యం అంతరించినప్పటి నుంచి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రగానే కొనసాగింది. దోపిడీ చేసే వర్గాలకు, దోపిడీకి గురయ్యే వర్గాలకు మధ్య జరిగిన పోరాటమే చరిత్రను ముందుకు నడిపించింది. ఈ పోరాటం ఇప్పుడు శ్రామికవర్గం తనను దోపిడీ చేసే పెట్టుబడిదారీ వర్గం నుంచి విముక్తి పొందే చారిత్రక దశకు చేరుకుంది. ఈ ప్రాథమిక ఆలోచన పూర్తిగా, ప్రత్యేకంగా కార్ల్ మార్క్స్‌కు చెందుతుందని ఎంగెల్స్ స్పష్టం చేశారు. తన సహచరుడి మేధోపరమైన కృషికి ఆయన ఇచ్చిన గౌరవం, వ్యక్తిత్వంలోని నిస్వార్థతకు నిదర్శనం.
1842లో కొలోన్‌లో తొలిసారి కలుసుకున్నప్పటికీ, వారి మధ్య నిజమైన మేధోపరమైన అనుబంధం ఏర్పడింది 1844 ఆగస్టులో పారిస్‌లో జరిగిన పునః సమావేశంతోనే. ఆ పది రోజుల సుదీర్ఘ చర్చలు ఇద్దరి ఆలోచనా ప్రపంచాలను మరింత దగ్గర చేశాయి. తత్వ శాస్త్రం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరిణామం, కార్మికవర్గ విముక్తి వంటి అనేక అంశాలపై ఇద్దరికీ సారూప్యమైన అభిప్రాయాలు ఉన్నాయని వారు గుర్తించారు. ఆ తరువాత వారి స్నేహం ఒక సాధారణ వ్యక్తిగత అనుబంధంగా మిగిలి పోలేదు. ప్రపంచ కార్మికవర్గ ఉద్యమ చరిత్రను ప్రభావితం చేసిన అసాధారణ మేధో భాగస్వామ్యంగా మారింది.
1844లో ఇద్దరూ కలిసి రచించిన ‘ది హోలీ ఫ్యామిలీ వారి ఉమ్మడి రచనా ప్రయాణంలో తొలి ముఖ్యమైన అడుగు. అనంతరం 1845–46లో ‘ది జర్మన్ ఐడియాలజీ’ రచన ద్వారా భౌతికవాద చరిత్ర దృక్పథాన్ని మరింత వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేశారు.
సమాజాన్ని మార్చేది కొందరు మహానుభావుల ఆలోచనలు మాత్రమే కాదని, ప్రజల శ్రమ, ఉత్పత్తి సంబంధాలు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పోరాటాలేనని విశ్లేషించారు. ముఖ్యంగా శ్రామికవర్గం తన విముక్తిని తానే సాధించు కోవాల్సిన చారిత్రక అవసరాన్ని వివరించారు. మార్క్స్, ఎంగెల్స్ సంబంధంలో అత్యంత హృద్యమైన అంశం వారి సిద్ధాంత పరమైన అనుబంధంతోపాటు వ్యక్తిగత జీవితాల్లోనూ ఒకరికొకరు అండగా నిలిచిన తీరు. మార్క్స్ అనేక సంవత్సరాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రచనలు చేసినప్పటికీ ఆయనకు స్థిరమైన ఆదాయం ఉండేది కాదు. కుటుంబ పోషణ, పరిశోధన, రచనా వ్యయం ఆయనకు నిరంతర సమస్యలుగా ఉండేవి. ఈ పరిస్థితుల్లో ఎంగెల్స్ తన వ్యక్తిగత సాహిత్య ఆకాంక్షలను పక్కనపెట్టి మాంచెస్టర్‌లోని పత్తి వ్యాపార సంస్థలో ఉద్యోగం చేపట్టారు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపారంలో భాగస్వామిగా మారారు. అక్కడ సంపాదించిన ఆదాయంలో గణనీయమైన భాగాన్ని మార్క్స్ పరిశోధనలకు, కుటుంబ అవసరాలకు అందించారు.
కొన్ని సందర్భాల్లో మార్క్స్‌కు ఆర్థిక సహాయం చేయడానికి ఆయన పేరుతోనే ‘న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్’కు వ్యాసాలు కూడా రాశారు ఏంగెల్స్ మార్క్స్ ‘దాస్ కాపిటల్’ రచనను పూర్తి చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో ఏంగెల్స్ పాత్ర అత్యంత కీలకమైనది. 1870లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా మార్క్స్‌కు వార్షిక ఆర్థిక భత్యాన్ని అందించారు. ‘దాస్ కాపిటల్’ మొదటి సంపుటి ప్రచురణకు సిద్ధమైనప్పుడు మార్క్స్గె ఏంగెల్స్ కు రాసిన లేఖలో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నారు: ఈ సంపుటి సిద్ధమైందంటే అందుకు కారణం మీరు, మీరు మాత్రమే. మీ త్యాగం లేకపోయి ఉంటే, నేను మూడు సంపుటాలుగా చేపట్టిన ఈ అపారమైన కృషిని ఎప్పటికీ పూర్తి చేయలేక పోయేవాడిని. నా హృదయపూర్వక కృతజ్ఞతతో మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటున్నాను అని పేర్కొన్నారు మార్క్స్.
ఇది కేవలం ఇద్దరు మేధావుల మధ్య స్నేహం మాత్రమే కాదు. ఒకరి ఆశయ సాధన కోసం మరొకరు తమ జీవితంలోని విలువైన భాగాన్ని త్యాగం చేసిన అరుదైన చారిత్రక అనుబంధం. ఏంగెల్స్ కేవలం సామాజిక, రాజకీయ తత్వవేత్త మాత్రమే కాదు. సైనిక వ్యూహాలు, యుద్ధ చరిత్ర, సైనిక కార్యకలాపాలపై కూడా లోతైన అవగాహన కలిగిన విశ్లేషకుడు. క్రిమియన్ యుద్ధ సమయంలో ‘న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్’లో ఆయన రాసిన వ్యాసాలు సైనిక చరిత్రపై ఆయనకున్న పట్టు, విశ్లేషణా సామర్థ్యాన్ని వెల్లడించాయి. ఆ వ్యాసాలను ప్రశంసిస్తూ మార్క్స్గె ఏంగెల్స్కు రాసిన లేఖలో, మీ సైనిక వ్యాసాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవి జనరల్ స్కాట్ రాసినవని న్యూయార్క్‌లో ప్రచారం జరుగుతోందని కూడా చమత్కరించారు.
మార్క్స్, ఏంగెల్స్ కేవలం పుస్తకాలు రాసిన సిద్ధాంతకర్తలు కాదు. తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకు రావడానికి కార్మికవర్గ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విప్లవకారులు. ‘లీగ్ ఆఫ్ ది జస్ట్’ అనే సంస్థను కమ్యూనిస్టు లీగ్‌గా మార్చడంలో వారి పాత్ర కీలకమైనది. ఈ సంస్థ కోసం ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించే బాధ్యతను వారు స్వీకరించారు. ఏంగెల్స్ రూపొందించిన ప్రాథమిక ముసాయిదా ఆధారంగా మార్క్స్‌తో కలిసి కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. 1848లో వెలువడిన ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన పత్రంగా నిలిచింది. దాని ముగింపులో వారు ప్రపంచ కార్మికులకు ఇచ్చిన పిలుపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది . “ప్రపంచ కార్మికులారా ఏకం కండి! మీరు కోల్పోయేది మీ సంకెళ్లు తప్ప మరేమీ లేదు. సాధించాల్సింది మాత్రం ఒక ప్రపంచం ఉంది!”
1864లో స్థాపించబడిన అంతర్జాతీయ వర్కింగ్‌మెన్స్ అసోసియేషన్, అంటే మొదటి ఇంటర్నేషనల్ నిర్మాణంలో మార్క్స్, ఏంగెల్స్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. వివిధ దేశాల్లోని కార్మిక సంఘాలు, వామపక్ష ఉద్యమాలను ఒకే అంతర్జాతీయ వేదికపైకి తీసుకు రావడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం.
1871లో పారిస్ కమ్యూన్ ఓటమి అనంతరం మొదటి ఇంటర్నేషనల్ బలహీనపడింది. అనంతరం అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి కొత్త దిశను అందించే క్రమంలో ఏంగెల్స్ రెండవ ఇంటర్నేషనల్ ఏర్పాటులోనూ ముఖ్యమైన పాత్ర పోషించారు . ప్రతి దేశంలోని కార్మికవర్గం తన స్వతంత్ర రాజకీయ పార్టీని నిర్మించు కోవాలని, కార్మిక సంఘాల ఉద్యమంతో పాటు రాజకీయ పోరాటాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
మార్క్సిజం ప్రత్యేకత దాని శాస్త్రీయ విశ్లేషణలోనూ, విప్లవాత్మక సామాజిక లక్ష్యంలోనూ ఉందని లెనిన్ పేర్కొన్నారు. మార్క్స్ మరణానంతరం మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచ కార్మికవర్గానికి మరింత విస్తృతంగా పరిచయం చేసిన బాధ్యతను ఏంగెల్స్ తన భుజాలపై వేసుకున్నారు. మార్క్స్ వదిలివెళ్లిన అసంపూర్తి పరిశోధనలు, చేతిరాత ప్రతులు, నోట్లను క్రమబద్ధీకరించి, సవరించి, ‘దాస్ కాపిటల్’ రెండవ, మూడవ సంపుటాలను ప్రచురించారు. కమ్యూనిస్టు మానిఫెస్టో తదితర రచనల కొత్త సంచికలకు ముందు మాటలు రాశారు. అప్పటి సామాజిక, ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని వివరించే ప్రయత్నం చేశారు. లెనిన్ ఏంగెల్స్ గురించి మాట్లాడుతూ ఆయన శ్రామికవర్గానికి తనను తాను తెలుసు కోవడం, తన చారిత్రక పాత్రను అర్థం చేసుకోవడం నేర్పించారని ప్రశంసించారు. ఆయన్ని ‘శ్రామికవర్గపు గొప్ప పోరాట యోధుడు, ఉపాధ్యాయుడు’గా అభివర్ణించారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక చారిత్రక ఉద్యమానికి ప్రతీక!
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవితం మనకు అందించే సందేశం ఎంతో గొప్పది. సిద్ధాంతం, ఆచరణ, స్నేహం, త్యాగం, సామాజిక బాధ్యత ఇవన్నీ ఒకే వ్యక్తిత్వంలో ఎలా కలిసిపోగలవో తన జీవితం నిరూపిస్తుంది.మార్క్స్‌తో కలిసి ఆయన నిర్మించిన మేధోపరమైన పునాదులు ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గ ఉద్యమాలకు, సామాజిక మార్పు కోసం సాగిన పోరాటాలకు ప్రభావం చూపించాయి. మార్క్స్‌కు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, ఆయన మరణానంతరం అసంపూర్తిగా మిగిలిన రచనలను ప్రపంచానికి అందించడం ద్వారా ఏంగెల్స్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు . మార్క్స్, ఎంగెల్స్ మధ్య ఉన్న స్నేహం వ్యక్తిగత అనుబంధాన్ని మించినది. అది ఒక ఉమ్మడి ఆశయం కోసం, సమానత్వం కోసం, దోపిడీ రహిత సమాజం కోసం సాగిన జీవితకాల పోరాటం. “కార్మికవర్గ విముక్తి కోసం కలలు కన్న, ఆ కలలను శాస్త్రీయ సిద్ధాంతాలుగా మలిచిన, తన సహచరుడి ఆశయ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్కు ఘనమైన నివాళి!.
